
KCR : ఏ రోటి కాడ ఆ పాట అనే సామెతను ఇప్పుడు బీఆర్‌ఎస్ నిజం చేయబోతోంది. ఇప్పుడు బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ కనుక, కేసీఆర్ దేశ్ కి నేత కనుక.. అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలి అనుకుంటోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో పాటలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన కవులను పిలిపించి పాటలు రాయించారు. రికార్డింగ్ ప్రక్రియ కూడా పూర్తయిందని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. దీనిని నేరుగా కేసీఆరే పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నాయి. ‘దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యేందుకు బీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎ్‌స్ ను అన్ని రాష్ట్రాలకూ విస్తరించేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా.. దేశ ప్రజలకు తమ వ్యూహాలు, విధి విధానాలను తెలియపర్చేందుకు పార్టీకి సంబంధించిన పాటల రూపకల్పన స్థానిక భాషాల్లో చేపడుతున్నారని’ భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి.
-శరవేగంగా..
ఇప్పటికే హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ.. భాషల్లో పాటల రూపకల్పన వేగంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకతలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజలను ఆకర్షించే అంశాల ఆధారంగా ఆయా భాషల్లో ప్రావీణ్యం ఉన్న రచయితలతో ఆ పాటలు రాయించారు. పాటల రికార్డింగ్ ప్రక్రియ పూర్తయింది. అలానే పార్టీకి సంబంధించిన జెండాలు, కండువాలు, టోపీలు వంటివి సైతం స్థానిక భాషల్లోనే ముద్రించేలా, పార్టీ ప్రకటనలు స్థానిక పత్రికల్లో ప్రచురితమయ్యేలా దృష్టి సారించినట్లు తెలిసింది. బీఆర్‌ఎ్‌సను విస్తరించేందుకు అవసరమైన అన్ని మార్గాలపై పార్టీ అధినేత దృష్టిసారించినట్లు, అందుకు అనుగుణంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
-సొంత పత్రికలు కూడా
బీఆర్‌ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరగాలంటే తెలంగాణలో మాదిరిగానే.. పలు రాష్ట్రాల్లో తమ సొంత పత్రికను ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ వాణిని అన్ని రాష్ట్రాల్లోనూ బలంగా వినిపించేందుకు సొంత పత్రికలు ఉండాలని బీఆర్‌ఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీలో పత్రికను తీసుకురావాలి అనుకుంటున్న తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్టు సమాచారం. ప్రస్తుత తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి ఆధర్యంలోనే ఏపీలో పత్రిక నిర్వహణ సాగించే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటికే పలు కార్యాలయాలు పరిశీలించారని తెలుస్తోంది.