Chandrababu- Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ తనకు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని నమ్ముతున్నారు. వారి మద్దతుతోనే మరోసారి అధికారంలోకి వస్తానని భావిస్తున్నారు. కానీ ఆ ఓటు బ్యాంక్ పైనే అటు చంద్రబాబు, ఇటు పవన్ కన్నేశారు. వారి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ ను రాజకీయంగా దెబ్బకొట్టి ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన మధ్య సానుకూల వాతావరణం ఉంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత లేకున్నా.. అటు పవన్, ఇటు చంద్రబాబు ఒకే అజెండాపై ముందుకెళుతున్నారు. తమ ఉమ్మడి శత్రువు జగన్ ను గద్దె దించేందుకు పావులు కదుపుతున్నారు. కానీ వారిద్దరికీ చెక్ చెప్పేలా అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. జగన్ అధికారానికి దూరమైన మరుక్షణంలోనే సంక్షేమ పథకాలు నిలిచిపోయతాని వైసీపీ నేతలు ప్రచారం మొదలు పెట్టారు.

జగన్ అప్పుచేసి మరీ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. అయితే ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలో నెడుతున్నారని మాత్రమే విపక్షాలు విమర్శిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలుపై విమర్శలు చేసే సాహసం చేయడం లేదు. అందుకే సంక్షేమ పథకాల లబ్ధిదారులపై జగన్ ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కోటి 30 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఒక అంచనా. వీరంతా తిరిగి తమనే అధికారం కట్టబెడతారని వైసీపీ నేతలు చాలా నమ్మకంగా ఉన్నారు. దానిని మరింత స్ట్రాంగ్ చేసుకునేందుకు జగన్ సర్కారు ఇంటింటా కరపత్రాలు సైతం పంపిణీ చేస్తోంది. ఈ పథకాలు నిలిచిపోవాలని ప్రభుత్వంపై పవన్, చంద్రబాబులు దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అధికార పార్టీ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు.
మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలన్ని అమలుచేశామని జగన్ చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి పథకాలు అందుతున్న వారిని తమ పార్టీ ఓటర్లుగా భావిస్తున్నారు. అయితే దీనిని గుర్తించిన చంద్రబాబు, పవన్ స్ట్రాటజీని మార్చారు. నేరుగా సంక్షేమ పథకాల అమలు, అవినీతిపై ప్రశ్నిస్తే అసలుకే ఎసరు వస్తుందని తెలిసి రూటు మార్చారు. అవే సంక్షేమ పథకాల అమలుపై హామీలు ఇవ్వడం ప్రారంభించారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే మెరుగైన సంక్షేమ పథకాలిస్తామని హామీలివ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెబుతున్నారు.మొన్నటికి మొన్న విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ ఇంతకంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలుచేస్తామని.. పారదర్శకంగా అమలుచేస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇదే విషయంపై స్పందించారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు.ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింతగా మెరుగుపరుస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికే సంక్షేమం మాటున వైసీపీ సర్కారు అప్పులుచేస్తోందని చంద్రబాబు ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే చంద్రబాబు పథకాలను రెట్టింపు చేస్తామన్న ప్రకటనపై సీఎం జగన్ స్పందించేఅవకాశముంది. మొత్తానికైతే జగన్ బ్రహ్మస్త్రంపై చంద్రబాబు, పవన్ ల గురి ఏ మేరకు వర్కవుటుందో చూడాలి మరీ.