Munugode By Election 2022: మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. నెల రోజుల్లో ఈ తంతు ముగియ బోతుంది. ఎన్నికలు అన్నాక ఎవరో ఒకరు గెలుస్తారు. ఆ గెలిచిన వారే శాసనసభకు వెళ్తారు. ఇదంతా కామనే అయినప్పటికీ.. కానీ మునుగోడు ఎన్నికలను టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరో ఏడాదిలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఎన్నిక అన్ని పార్టీలకు ముఖ్యమైనదిగా పరిణమించింది. దసరా రోజు జాతీయ పార్టీ ప్రారంభిస్తున్న కేసీఆర్కు, తెలంగాణ ఇచ్చిన పార్టీని అధికారంలోకి తేవాలన్న రేవంత్ కు, డబుల్ ఇంజన్ సర్కారు తీసుకురావాలనుకుంటున్న బండి సంజయ్ కి.. మునుగోడు చాలా కీలకం. నోటిఫికేషన్ ముందే మూడు పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. మొన్నటిదాకా హుజరాబాద్ చాలా కాస్ట్లీ అనుకున్నారు కానీ.. దానిని మించేలా మునుగోడు ఉంది. మూడు పార్టీలు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. ఓటర్లకు కోరినన్ని కానుకలు ఇస్తున్నాయి. ఎలాగైనా గెలవాలి అనే తలంపుతో మూడు పార్టీలు ముగ్గురు కీలక వ్యక్తులకు ప్రచార బాధ్యతులు అప్పగించాయి.

బిజెపి నుంచి జితేందర్ రెడ్డి
గతంలో టిఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందిన ఈయన కెసిఆర్ తో తెగ తెంపులు చేసుకొని బిజెపిలో చేరారు. టిఆర్ఎస్ అనుపానులు మొత్తం తెలిసిన ఈయన దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాదులో కాషాయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఆ చతురత తెలిసే సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈయనకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. గత రెండు నెలల నుంచి జితేందర్ రెడ్డి మునుగోడు లోనే మకాం వేశారంటే బిజెపి ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు కుల సంఘాలను సమన్వయం చేయడంలో మంచి నేర్పరి అయిన జితేందర్ రెడ్డి .. అదే మంత్రాన్ని మునుగోడు లోనూ అమలు చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే తలంపుతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రను కూడా వాయిదా వేసుకున్నారు.

టిఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి
దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తున్నారు. అంతకంటే ముందే బిజెపిపై యుద్ధం ప్రకటించారు. ఫలితంగా బిజెపి, టీఆర్ఎస్ మధ్య టా గ్ ఆఫ్ వార్ జరుగుతున్నది. ఇది మును ముందు దారితీస్తుందో తెలియదు. మాటల యుద్ధం మాత్రం తార స్థాయికి వెళ్ళింది. ఇక జగదీష్ రెడ్డి కూడా ఏ గ్రామాన్ని విడిచిపెట్టకుండా ప్రచారం చేస్తున్నారు.
Also Read: KCR- AP TDP Leaders: ఏపీ టీడీపీ నేతలపై కేసీఆర్ ఫోకస్.. జాబితాలో ఉన్నదెవరు?
అసంతృప్తంగా ఉన్న నాయకులను బుజ్జగిస్తున్నారు. ఇటీవల సంస్థాన్ నారాయణపురం లోని ఓ గ్రామంలో లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే అవి మహబూబ్నగర్ నుంచి రావడం ఆలస్యం అవుతుండడంతో.. యూనిట్లకు బదులుగా డబ్బులు ఇచ్చారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు టిఆర్ఎస్ మునుగోడుకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో. వరకు ఎవరి అభ్యర్థితో ఖరారు కాకపోయినప్పటికీ.. ప్రభాకర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన బూర నర్సయ్య గౌడ్ మునుగోడు టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే అధిష్టానం పై తిరుగుబావుట ఎగరేస్తానని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అసమ్మతిని టిఆర్ఎస్ ఎలా నిలవరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

అన్ని రేవంత్ రెడ్డి పైన
టిఆర్ఎస్, బిజెపి సంగతి అలా ఉంచితే.. మునుగోడులో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ అనుకుంటున్నది. తన పార్టీకి చెందిన సిట్టింగ్ స్థానం కావడం, ఏడుసార్లు ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంతో.. ఈసారి కూడా అదే మ్యాజిక్ పునరావృతం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఎనిమిదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. 2023లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి.. ఈ ఎన్నిక ఆయన నాయకత్వానికి ఒక పరీక్ష. పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. అధిష్టానం నుంచి బలమైన ప్రోత్సాహం లభిస్తుండడంతో ఆయన ముందుకు వెళ్తున్నారు.

అయితే స్రవంతి రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసే విషయంలో రేవంత్ రెడ్డికే అధిష్టానం పూర్తి అధికారాలు ఇవ్వడంతో ప్రచారంలో కూడా తన వర్గీయులనే ముందు వరుసలో ఉంచారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి స్రవంతి రెడ్డికి నాయకులు సహకరించిన దాన్నిబట్టే ఆమె విజయ అవకాశాలు ముడిపడి ఉన్నాయి. మరో ఏడాదిలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఉన్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని టిఆర్ఎస్ అనుకుంటున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోనూ జెండా ఎగరేయాలని బిజెపి అనుకుంటున్నది. దాదాపు 8 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం కోసం పాకులాడుతున్నది. ఇలా ఎటు చూసుకున్నా మునుగోడు ఎన్నిక మూడు పార్టీలకు జీవన్మరణ సమస్య. నాయకులు ఎలా ఉన్నా, ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. అంతిమంగా ఓటు వేసేది ఓటర్లే కాబట్టి పార్టీల భవితవ్యం మునుగోడు ఓటర్ల మీదనే ఆధారపడి ఉంది.