Hyderabad : విద్య, ఉపాధి అవకాశాలకు నెలవైంది భాగ్యనగరం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే క ఆకుండా ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగాలు, పనులు వెతుక్కుంటూ భాగ్యనరగానికి వస్తుంటారు. కానీ, ఈ భాగ్యనగరంలో ఇళ్లు అద్దెకు దొరకని అభాగ్యులెందరో. హడలెత్తిస్తున్న అద్దెలతో కామన్ మ్యాన్ గుండెలు గుబేల్ మంటున్నాయి. నగరంలో రూ.6 వేలకు మించి ఇస్తేగానీ బ్యాచ్లర్లకు సింగిల్ రూం దొరకడం లేదు. విద్యుత్, నల్లాబిల్లులు అదనం.
హాస్టళ్లలో ఉండలేక..
హాస్టళ్లలో ఉందామనుకుంటే.. అక్కడా కనీసం రూ. 5 వేల నుంచి రూ.6 వేలు లేనిదే మంచి భోజనం పెట్టే పరిస్థితి లేదు. దీంతో మంచి భవిష్యత్తును ఊహించుకుని నగరంలో అడుగుపెట్టేవారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటి నుంచి పంపే డబ్బులో సగం అద్దెకు పోతుంటే మిగిలిన డబ్బుతో నెలంతా సర్దుకోవాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుద్యోగుల విషయానికొస్తే వేతనంలో సగం అద్దెకే చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా తర్వాత..
కరోనా తర్వాత అన్నింటి ధరలు పెరిగాయి. నిత్యావసరాలతోపాటు, వైద్యం ఖర్చులు, ఇంటి అద్దెలు కూడా బాగా పెరిగాయి. కరోనా సమయంలో పడిపోయిన ధరలు, కరోనా తర్వాత 20 నుంచి 30 శాతం అదనంగా పెరిగాయి. కరోనాకు ఉమందు 3 వేల నుంచి 4 వేల రూపాయలు ఉన్న అద్దె కరోనా తర్వాత రూ.5 వేల నుంచి రూ.6 వేలకు చేరింది. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు అద్దె ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. జూబ్లీహిల్, బంజారాహిల్స్‌లాంటి కాస్ట్లీ ప్రదేశాల్లో అద్దె రూ.8 వేలకు పైనే ఉంది.
సింగిల్ రూంలకు డిమాండ్..
అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, విద్యానగర్, అంబర్పేట్, మాణికేశ్వర్ బ్బస్తీ, సికింద్రాబాద్, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, ఉప్పల్, యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో అనుకున్న బడ్జెట్లో సింగిల్ రూమ్ చాలా సులభంగా లభించేది. బ్యాచిలర్ల కోసమే పెంట్ హౌస్‌లు నిర్మించేవారు. కాలక్రమంలో వాటి నిర్మాణం తగ్గిపోయింది. 1బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే నిర్మిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి 1 బీహెచ్‌కే ఇళ్లకు రూ.8 వేల నుంచి రూ.15 వేల మధ్య, 2 బీహెచ్‌కే ఇళ్లు ఇళ్లకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకూ అద్దెలున్నాయి. దీంతో 10 నుంచి 15 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోని సింగిల్ రూంలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సింగిల్ రూంలకు అద్దెతోపాటు విద్యుత్, నల్లా బిల్లు కలిపి నెలకు రూ.6,500 నుంచి రూ.7,500 వరకూ చెల్లించాల్సి వస్తోంది.
షరతుల తలనొప్పులు…
ఇక అద్దె ఇల్లు దొరకడం ఒకెత్తయితే.. యజమానుల షరతులతో తల్లడిల్లుతున్నారు. సింగిల్ రూం అయితే ఇద్దరే ఉండాలి. ముగ్గురు ఉండాలనుకుంటే ఓ వెయ్యి అదనంగా చెల్లించాలి. కొత్తవారెవరూ గదికి రావొద్దు.. రాత్రి 9 అయితే దీపాలు ఆర్పేయాలి. నాలుగైదు బకెట్లకు మించి నీరు వాడొద్దు. భవనం పైనున్న బాత్రూం వాడాలంటూ షరతులు విధిస్తున్నారు. దీనికి తోడు పార్కింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనం ఇంటి ముందు పెట్టొద్దని చెప్పడంతో వాటికి రక్షణ లేకుండా పోతోంది.
ఇలా విశ్వనగరం హైదరాబాద్‌లో బ్యాచ్లర్లతోపాటు ఫ్యామిలీలు కూడా అద్దె ఇళ్ల కోసం పాట్లు పడుతున్నారు. అందుబాటు ధరలో ఇళ్లు దొరకడమే మహద్భాగ్యంగా మారిపోయింది.