
AP BRS: ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలన్న కేసీఆర్ ప్రయత్నం ఫలించడం లేదు. బీఆర్ఎస్ విస్తరణ తరువాత ఏపీలో శరవేగంగా అడుగులు వేయాలని కేసీఆర్ భావించారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించి కనీసం నాలుగైదు శాతం ఓట్లు సాధించాలని పట్టుదలగా కనిపించారు. అయితే అవేవీ కలిసి రావడం లేదు. నాయకుల చేరిక కూడా ఆశించినంతగా లేదు. ఒకరిద్దరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ ల చేరికతో మమ అనిపించేశారు. అటు విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభిస్తామని.. ఏపీలో భారీ బహిరంగ సభను గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అవేవీ జరగడం లేదు. కేసీఆర్ కేవలం మహారాష్ట్రపై కాన్సంట్రేట్ చేశారు. ఇప్పుడు కర్నాటక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనా అక్కడ కూడా ఎటువంటి కార్యాచరణ ప్రారంభించలేదు.
ఆశించిన స్థాయిలో చేరికలేవీ?
బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత ఏపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. ప్రధానంగా టీడీపీ నుంచి చేరికలు ఉంటాయని విశ్లేషణలు సైతం వెలువడ్డాయి. ముఖ్యంగా కాపు, వెలమ సామాజికవర్గాలను టార్గెట్ చేశారని.. అందరూ ఆశ్చర్యపడేలా నేతల చేరికలు ఉంటాయని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా జనసేన నుంచి అలిండియా సర్వీసు అధికారి తోట చంద్రశేఖర్ ను రప్పించి రాష్ట్ర సారధ్య బాధ్యతలు అప్పగించారు. బీజేపీలో ఉన్న రావెల కిశోర్ బాబును రప్పించి జాతీయ కార్యకలాపాల బాధ్యతలను అప్పగించారు. అంతకు మించి అడుగులు పడలేదు. ఇప్పుడు తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, నేవీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న మాజీ డీజీపీ సాంబశివరావులను బీఆర్ఎస్ పార్టీలో చేర్పించేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. అయితే కేవలం మాజీ అధికారులే బీఆర్ఎస్ లోకి మొగ్గుచూపుతున్నారని.. నాయకలెవరూ ఇటువైపుగా రాకపోవడం విశేషం.

డిమాండ్లతో ప్రగతిభవన్ కు దడ…
అయితే నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు రకరకాలుగా డిమాండ్ చేయడంతో ప్రగతిభవన్ వర్గాలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ప్రధానంగా అంతగా ప్రాచుర్యం లేని కుల సంఘాల నాయకులు, గతంలో పనిచేసి రాజకీయంగా యాక్టివ్ లేని నాయకులు ప్రగతి భవన్ కు వెళ్లి కలుస్తున్నారుట. తాము పార్టీలో చేరితే ఎటువంటి ప్యాకేజీ అందిస్తారని ప్రశ్నిస్తున్నారుట. పార్టీలో చేరాలంటే కొంత మొత్తం నగదుతో పాటు గొంతెమ్మ కోరికలను అడుగుతున్నారుట. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం పునరాలోచనలో పడిందట. పార్టీలో చేరక ముందే. ఇలా ఉంటే.. చేరిన తరువాత ప్యాకేజీ నాయకులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తుందట. అందుకే మాజీ అధికారులు కొంతవరకూ నిజాయితీ, నమ్మకంగా ఉంటారని భావించి పార్టీలో చేర్చుకుంటుందట. ఆ కోవలోనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ డీజీపీ సాంబశివరావును సంప్రదిస్తున్నట్టు సమాచారం.
నవంబరు తరువాతే విస్తరణకు అవకాశం...
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ విషయంలో నవంబరు తరువాతే ఒక స్పష్టత వచ్చే చాన్స్ కనిపిస్తోంది. నవంబరులో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. వాటి సన్నాహాల్లో కేసీఆర్ తలమునకలై ఉన్నారు. మరోవైపు కుమార్తె కవిత చుట్టూ బిగుస్తున్న సీబీఐ కేసుతో కేసీఆర్ బిజీగా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ విస్తరణ విషయం పక్కనపెట్టారు. నవంబరులో ఎన్నికల ముగిశాక.. అక్కడ ఫలితాలకు అనుగుణంగా ఏపీలో పావులు కదపనున్నారు. తెలంగాణలో భారీ విజయం నమోదైతే ఏపీలో తప్పకుండా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సొంతింటిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. అప్పటి వరకూ ఏపీ బాధ్యతలను మాజీ అధికారులకు అప్పగించారు. వారే చక్కబెడుతున్నారు.