Jagan: షర్మిల కుమారుడి వివాహ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. రాజస్థాన్ లో వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. జనవరి 17న హైదరాబాదులో నిశ్చితార్థ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మేనమామ హోదాలో ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే జగన్ విషయంలో సోదరి షర్మిల అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కుమారుడి నిశ్చితార్థ సమయానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పిసిసి పగ్గాలు అందుకోలేదు. గత నెల 21న ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. వైసిపి సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నేరుగా సోదరుడు జగన్ పైనే టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులకు ఆమె ప్రత్యర్థిగా మారిపోయారు. కేవలం సోదరుడు జగన్ ను గద్దెదించాలన్న ధ్యేయంతో షర్మిల పని చేస్తుండడం విశేషం. అయితే ఈ పరిణామ క్రమంలో సోదరుడు జగన్ తో షర్మిల కు పెద్ద అగాధమే ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల కుమారుడి వివాహానికి జగన్ వెళ్తారా? లేదా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. అయితే వివాహ వేడుకలకు జగన్ వెళ్ళరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈనెల 18న అనంతపురం జిల్లా రాప్తాడు లో వైసిపి సిద్ధం సభను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్రలోని భీమిలిలో తొలి సిద్ధం సభను నిర్వహించగా.. రాజమండ్రిలో మలి విడత సభ జరిగింది. ఇప్పుడు అనంతపురం జిల్లా రాప్తాడు లో మూడో సభ జరగనుంది. మొన్న సీఎం జగన్ ఢిల్లీ టూర్ తో ఇక్కడ సభ వాయిదా పడింది. ఈనెల 18న నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయలసీమలో జరుగుతున్న ఈ సభను వైసిపి కీలకంగా భావిస్తోంది. సరిగ్గా అదే రోజు షర్మిల కొడుకు వివాహం జరగనుండడం విశేషం. దీంతో జగన్ హాజరు ఉండదని.. అవకాశమే లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు చంద్రబాబు తో పాటు ఇతర నాయకులకు ఆహ్వానం ఉంది. వారంతా హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే వారితో వేదిక పంచుకోవడం జగన్ కు ఇష్టం లేదని.. ఆయన ఈ వివాహానికి హాజరుకారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.