Vijaysai Reddy: విజయసాయి వైపు వైసీపీ అనుమానపు చూపులు

కొద్దిరోజుల కిందట విజయసాయిరెడ్డి బంధువులు టిడిపిలో చేరారు. ఒక్క విజయసాయిరెడ్డి దంపతులు మాత్రమే వైసీపీలో ఉండిపోయారు. బావమరిది, ఇతరత్రా కుటుంబ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు.

Written By: Dharma, Updated On : February 6, 2024 1:53 pm

Vijaysai Reddy

Follow us on

Vijaysai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డి వ్యవహార శైలిపై అనుమానాలు ఉన్నాయి. గతంలో ఓసారి ఆయనపై చాలా రకాల ప్రచారాలు జరిగాయి. కొద్ది నెలల పాటు ఆయన పార్టీకి దూరమయ్యారు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన దగ్గర ఉన్న పార్టీ బాధ్యతలను జగన్ తీసుకోవడం ప్రారంభించారు. దీంతో విజయసాయిరెడ్డి పార్టీ నుంచి దూరం అవుతారా? అన్న టాక్ కూడా నడిచింది. ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. అయితే అక్కడకు కొద్ది రోజుల తర్వాత విజయసాయి రెడ్డి తిరిగి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. కానీ ఆయన చేస్తున్న చర్యల వల్ల వైసీపీకి నష్టం జరుగుతోందన్న ప్రచారం ప్రారంభమైంది.

కొద్దిరోజుల కిందట విజయసాయిరెడ్డి బంధువులు టిడిపిలో చేరారు. ఒక్క విజయసాయిరెడ్డి దంపతులు మాత్రమే వైసీపీలో ఉండిపోయారు. బావమరిది, ఇతరత్రా కుటుంబ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే వీరిని నియంత్రించేందుకు విజయసాయి ప్రయత్నించలేదు. వాస్తవానికి తారకరత్న మరణం విషయంలో విజయసాయి స్పందించారు. అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న భార్య విజయసాయికి కుమార్తె అవుతుంది. అటు ఆమె వైపు విజయసాయి, తారకరత్న వైపు చంద్రబాబు అండగా నిలబడ్డారు. తరచూ కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే విజయసాయిరెడ్డి పై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా వైసిపి నాయకత్వం విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ వచ్చింది.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకున్నారు.బిజెపి ప్రాపకం కోసం ఏకంగా రేవంత్ సర్కార్ పై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. తెలంగాణలో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు.రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఏపీలో ఎన్నికలపై తెలంగాణ ప్రభావం అధికం. గత ఎన్నికల్లోనే ఇది స్పష్టంగా తెలిసింది. ఆ విషయం విజయసాయిరెడ్డికి తెలియంది కాదు. ఏపీలో రాజకీయాలు చేసే వారిలో 90 శాతం మంది ఆర్థిక మూలాలు హైదరాబాదులోనే ముడిపడి ఉంటాయి. అప్పట్లో వారందరినీ ఎంతలా ఒత్తిడి చేసి కెసిఆర్ జగన్ కు అనుకూలంగా పని చేయించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే పనిచేయగలరు. ఆ విషయం తెలిసి కూడా విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రేవంత్ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే రవీంద్ర రెడ్డి అనే వైసిపి సోషల్ మీడియా ప్రతినిధిపై కేసు నమోదయింది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఇలా ఉంటుందో రేవంత్ సంకేతాలు పంపించారు. అయితే రేవంత్ చర్యల కంటే.. విజయసాయి వ్యవహరిస్తున్న తీరుపైనే వైసీపీలో చర్చ నడుస్తోంది.కావాలని విజయసాయి అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి.