Ponguleti Srinivasa Reddy- YS Sharmila: అటు కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది.. ఇటు బిజెపి వర్తమానం పంపింది.. కానీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పైగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇన్నాళ్లు మౌనంగా ఉన్న శ్రీనివాసరెడ్డి అధికార భారత రాష్ట్ర సమితి నాయకులపై నేరుగా విమర్శలు చేస్తున్నారు.. తనకు ఇన్నాళ్లు దక్కిన గౌరవం ఏమిటో చూశారు కదా అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు చెందిన తన అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తున్నారు.. అసలు పార్టీయే లేదు. ఎందులో చేరుతారో స్పష్టత లేదు. కానీ ఇంతలోనే తన అభ్యర్థులను శ్రీనివాసరెడ్డి పరిచయం చేయడం పట్ల జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

అయితే శ్రీనివాసరెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ… అదంతా అవాస్తవమేనని తేలిపోయింది. మరోవైపు కాంగ్రెస్ లో కూడా చేరేందుకు అవకాశం ఉందని వార్తలు రావడం.. దానిపై శ్రీనివాసరెడ్డి స్పందించకపోవడంతో అవి కూడా ఊహాజనితమే అని నిరూపితమైంది . ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన షర్మిల తో, ఆమె తల్లి విజయమ్మతో శ్రీనివాసరెడ్డి భేటీ కావడం సంచలనం కలిగించింది.. శ్రీనివాసరెడ్డి షర్మిల పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి.. భారత రాష్ట్ర సమితికి దూరం అయిన నాటి నుంచి పొంగులేటి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడితో భేటీ కాలేదు.. కానీ శ్రీనివాసరెడ్డి అటు విజయమ్మ, ఇటు షర్మిల తో బేటి కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పార్టీలో చేరే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ పాలేరు బరిలో షర్మిల ఉండడంతో ఆమె గెలుపునకు సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వైయస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఈనాటిది కాదు.. 2003 నుంచే ఈ బంధం మొదలైంది.. అప్పట్లో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉండేవి.. అవి అందుకున్న వారిలో పొంగులేటి కూడా ఒకరు. నాడు రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే పొంగులేటి అంచలంచెలుగా ఎదిగారు.. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడయ్యారు.. ఆయన స్థాపించిన వైఎస్ఆర్సిపికి తెలంగాణ అధ్యక్షుడు అయ్యారు. 2014లో తన ఎంపీగా గెలవడమే కాకుండా ముగ్గురిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు..

కాలక్రమంలో అధికార బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత కీలక నాయకుడిగా ఎదిగారు.. 2019లో మాత్రం ఎంపీ టికెట్ దక్కించుకోలేకపోయారు. అప్పటినుంచి భారత రాష్ట్ర సమితి అధిష్టానానికి, ఆయనకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నది. ఇప్పుడు ముదిరి పాకాన పడ్డది. మునుముందు ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి షర్మిల ఫోల్డ్ లో ఉన్నట్టు తెలుస్తోంది..