3 Years of YS Jagan Rule: రాష్ట్రానికి ఒక దశ లేదు.. దిశ లేదు. అంతా విధ్వంసకర పాలనే. అశుభమంటూ ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ సర్కారు పాలన ముచ్చగా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఇల్లు కూల్చి పరిహారం ఇచ్చినట్లు… భవిష్యత్తును కూల్చినందుకు పరిహారంగా ఇప్పుడు డబ్బులు పంచి ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షంలో ఉండగానే ఖరారు చేసుకున్న అజెండాను మాత్రం ఎంచక్కా అమలు చేస్తున్నారు. ఈ మూడేళ్లో ప్రశ్నించే విపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, కదిలితే కేసులు పెట్టడం, కుదిరితే అరెస్టు చేసి రిమాండుకు పంపడం పరిపాటిగా మారింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం సర్వ సాధారణంగా మారింది. ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారు. అప్పట్లో డాక్టర్ సుధాకర్ నుంచి ఇటీవల వెంకాయమ్మ దాకా… దళితులపై జరిగిన దాడులకు లెక్కేలేదు.

కొత్త ఉద్యోగాల ఊసులేదు..
కొత్త ఉద్యోగాల మాట లేదు కానీ.. తన సొంత సాక్షి మీడియాలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ సలహాదారులుగా, పీఆర్వోలుగా కొలువులు ఇచ్చి, ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించడమనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అమలుచేసే పథకాలకు బటన్ నొక్కడం, ఆ పేరుతో సొంత మీడియాకు ప్రకటనలు జారీ చేసి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టడమనే సరికొత్త స్కీమ్‌ను కనిపెట్టారు. రివర్స్ టెండరింగ్ అనే కొత్త విధానంతో అప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను మార్చి… కొత్త వాళ్లను, తమకు అనుకూలమైన విధానాల్లో తెచ్చుకున్నారు. మరే ఇతర ఉద్యోగాలూ ఇవ్వకుండా… మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బాటలు వేసే వలంటీర్లను మాత్రం లక్షల్లో నియమించుకున్నారు. జరుగుతున్న మాయలు, మతలబులను సామాన్య ప్రజలు గుర్తించకుండా… వారి కళ్లకు సంక్షేమ గంతలు కడుతున్నారు. పాత పథకాల పేర్లు, అమలు విధానం మార్చి సంక్షేమానికి తామే ఆద్యులమన్నట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు.
అప్పులకుప్ప..
పోనీ దేశ జాబితాలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారంటే అదీ లేదు. చేస్తున్న అభివృద్ధి పనుల్లేవ్. పూర్తయిన ప్రాజెక్టుల్లేవ్. రోడ్లకు మరమ్మతుల్లేవ్. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాల్లేవ్. అయినా సరే… ఖజానాలో డబ్బుల్లేవ్! నెలకు సగటున రూ.6వేల కోట్ల అప్పు చేస్తేగానీ బండి నడవని పరిస్థితి. వారం వారం ఆర్బీఐ తలుపు తట్టాల్సిందే! అప్పు తేవాల్సిందే. లేకుంటే… బండి నడవదు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ రుణభారం… ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది.

ఆదాయ మార్గాలను పెంచుకోకుండా, సంపద సృష్టించకుండా అప్పులపైనే ఆధారపడ్డారు. దీంతో అభివృద్ధి పనుల సంగతి పక్కనపెడితే జీతాలు, సంక్షేమ పథకాలకూ అప్పులే గతి అయ్యాయి. పరిశ్రమల ఊసేలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలినాళ్లలో సన్‌రైజ్ స్టేట్‌గా దేశ విదేశాల్లో ప్రచారం, అమరావతి నగర నిర్మాణం నింపిన జోష్, పోలవరం పరుగులు, ఐటీ-ఫిన్‌టెక్ హబ్‌గా మారుతున్న విశాఖనగరం, ఎలకా్ట్రనిక్ హబ్‌గా తిరుపతి, కియతోపాటు దాని అనుబంధ పరిశ్రమల కళతో అనంతపురం వంటి వాటికి ఎంతో ప్రాచుర్యం లభించింది.హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన సీమాంధ్ర వ్యాపారులు మళ్లీ సొంత గడ్డపైకి వచ్చి వ్యాపారాలు మొదలుపెట్టారు. అమరావతి ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ జోష్ కనిపించింది. జగన్ అధికారంలోకి రాగానే, ఆయన విక్రుత చర్యలతో అంతా మాయమైపోతయింది. ఏపీ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తున్నారు. కొత్తగా వచ్చిన పరిశ్రమల్లేవు. భారీ పెట్టుబడులూ లేవు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలూ లేవు.
ప్రజలపై పన్నుల రుద్దుడు..
జగన్ విపక్షంలో ఉండగా… ‘బాదుడే బాదుడు’ అంటూ మైకు పట్టుకుని ఊరూరా దీర్ఘాలు తీశారు. అధికారంలోకి రాగానే ‘వీర బాదుడు’ మొదలుపెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ తగ్గించలేదు. పదేపదే కరెంటు చార్జీల బాదుడు, ఆస్తి పన్ను బాదుడు, రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు, ఆర్టీసీ చార్జీల బాదుడు, చెత్త పన్ను బాదుడు! ‘కరోనా ఉన్నప్పటికీ సంక్షేమం ఆపలేదు’ అని గొప్పలు చెప్పారు తప్ప… కరోనా కాలంలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలను ఇంతగా బాధలు పెట్టిన సంగతి మాత్రం చెప్పరు. అన్నీ పక్కన పెట్టేసి… మూడేళ్లలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించినట్లుగా ‘గడపగడప’ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ పంచుతున్న కరపత్రాల్లోనూ అచ్చు తప్పులు, అబద్దాలే.
Also Read:Congress Rajya Sabha List: సోనియా గట్టి షాక్ ఇచ్చిందే.. బీజేపీ అయినా ఓన్ చేసుకుంటుందా?



[…] […]