YCP: వై ఏపీ నీడ్స్ జగన్..ఇది అసలు సిసలైన పార్టీ కార్యక్రమం. కానీ ప్రభుత్వ కార్యక్రమంగా అమలు చేస్తున్నారు. ప్రజలను బలవంతంగా భాగస్వామ్యం చేస్తున్నారు. ఇందుకుగాను యంత్రాంగం సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి ఇంట వైసీపీ జెండాతో పాటు జగన్కు అనుకూలంగా మార్కులు వేయాలని సూచిస్తున్నారు.
25 రకాల ప్రశ్నలతో కూడిన బుక్ లెట్ ను కార్యక్రమంలో భాగంగా నమోదు చేస్తున్నారు. జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయా? లేకుంటే చంద్రబాబు వా? అంటూ వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. జగన్కు పదికి పది మార్కులు, చంద్రబాబుకు 0 మార్కులు వేయకపోతే పథకాలు రావని కొందరు వలంటీర్లు బెదిరింపులకు దిగుతున్నారు.చివరకు జగన్ పరిపాలన బాగుందని ఆ ఇంట్లో వారితో చెప్పిస్తున్నారు. అందుకు సాక్షంగా ఓ సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్టాంపు ఆసక్తికరంగా ఉంది. ఇది చంద్రబాబుకు వ్యతిరేకంగా రూపొందించారు. ఆపు బాబు నాటకం.. జగనే మా నమ్మకం అనే స్టాంపు వేసి, సంతకం తీసుకొని సర్వే పూర్తి చేస్తుండడం విశేషం. ఇష్టం లేకున్నా ఇంటి పై వైసీపీ జెండా కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పథకాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లో ఇటువంటి చర్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమేపి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు సిద్ధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రాష్ట్రానికి జగన్ అవసరమనుకుంటే.. అది ప్రజలు అనుకోవాలి తప్ప… వైసీపీ నేతలు అనుకుంటే ఏం ప్రయోజనం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజల నుంచి తప్పకుండా వ్యతిరేకత వస్తుందని.. దానికి వైసిపి మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.