Telangana Govt: పెద్దలా..”భూ” గద్దలా? సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న వారికి సర్కారు స్థలాలా?

భూ కేటాయింపుల విధానం మేరకు మార్కెట్ విలువపై 10 శాతం లీజు వసూలు చేయాల్సి ఉంది. అంటే ఏడాదికి దాదాపుగా 50 కోట్ల చొప్పున లీజు నిర్ణయించాల్సి ఉండగా కేవలం 1,47,743గా ఖరారు చేసింది.

Written By: Rocky, Updated On : June 24, 2023 2:50 pm

Telangana Govt

Follow us on

Telangana Govt: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను అడ్డగోలుగా వ్యాపారవేత్తలకు కేటాయించింది. అప్పట్లో వీటికి సంబంధించి పలు కేసులు హైకోర్టు విచారణకు వచ్చినప్పుడు.. న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.. ప్రభుత్వ భూములకు, విలువైన వనరులకు సర్కారు కేవలం ట్రస్టీ గానే వ్యవహరించాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కెసిఆర్ సారధ్యంలోని సర్కారు వ్యాపారవేత్తలకు హైదరాబాద్ నగర శివారులోని విలువైన భూములను కేటాయించింది. ఈ కేటాయింపులో విధానాలకు పాతర వేసింది. దీనిని హైకోర్టు తప్పు పట్టింది. ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపింది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం నడిచిందే వనరుల కోసం. ఆ వనరులు పెద్దల చేతుల్లోకి వెళ్తుండడం, వాటిని కూడా ప్రభుత్వం దగ్గరుండి మరీ కట్టబెట్టడం విశేషం.

భూ కేటాయింపుల విషయంలో..

భూ కేటాయింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు దర్జాగా ఉల్లంఘిస్తోంది. పాలసీ ప్రకారం లీజు సొమ్ము వసూలు చేయడం లేదు. ఎప్పుడో వెనుకటి రోజుల్లో జీవోలను సాకుగా చూపించి.. వాటి ప్రకారం ఉన్నదారులకు ఇప్పుడు లీజుకు ఇస్తోంది. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు కాలంలో ప్రజాప్రయోజనాలకు సర్కారు భూమి మిగలని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా వివిధ సంస్థలకు భూమిని తక్కువ ధరకు కేటాయించినా ఒక అర్థం ఉంటుంది. కానీ సిబిఐ కేసుల్లో, ఈడీ దాడుల్లో ఇరుక్కున్న వారికి స్థలాలు కేటాయించడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఉదాహరణకు హెటిరో గ్రూప్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి ఎంపీ పార్థసారధి రెడ్డికి చెందిన “సాయి సింధు ఫౌండేషన్ ” కు భూ కేటాయింపు వ్యవహారమే ఇందుకు ప్రబల ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖానా మెట్ సర్వే లో ప్రభుత్వానికి 15 ఎకరాల అత్యంత విలువైన భూమి ఉంది. ఈ భూమిని ప్రభుత్వం పార్థసారధి రెడ్డికి చెందిన ఫౌండేషన్ కు కేటాయించింది. ఏడాదికి 1.47 లక్షల లీజు ధరతో 60 సంవత్సరాల పాటు ఆ భూమిని లీజుకు ఇస్తూ 2018లో జీవో 59 జారీ చేసింది. అక్కడ మార్కెట్ విలువ చదరపు గజానికి 75,000 ఉందని సాక్షాత్తు కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించింది. ఈ లెక్క ప్రకారం ఆ భూమి విలువ 540 కోట్లు ఉంటుంది. “క్యాన్సర్ అండ్ లైఫ్ థ్రెటెనింగ్ డిసీజెస్ మెడికేర్ సెంటర్” నిర్మాణం కోసం ఫౌండేషన్ చేసుకున్న దరఖాస్తు మేరకు దీనిని కేటాయించింది.

2012 జీవో ప్రకారం

2012లో ప్రభుత్వం జారీ చేసిన 571 జీవోలోని భూ కేటాయింపు విధానం ప్రకారం ఒక సంస్థకు కేటాయించేటప్పుడు దాని అనుభవం, పెర్ఫార్మెన్స్ వంటి ట్రాక్ రికార్డు ను, ఐటీ రిటర్న్ల దాఖలు వంటి అంశాలు పరిగణించాలి. ఈ ప్రకారం చేసుకుంటే హెటిరో లో గ్రూపుకు అంతటి గొప్ప చరిత్ర లేదు. ఆ సంస్థ మీద ఐటి దాడులు జరిగాయి. ఆ సంస్థలకు సంబంధించి లెక్కలోకి రాని 550 కోట్లు, మరో 142 కోట్ల నగదు పట్టుబడ్డాయి. క్వి డ్ ప్రో కో కేసులో పార్థసారధి రెడ్డి పేరు ఉంది. వీటన్నింటిని పట్టించుకోకుండానే ప్రభుత్వం సాయి సింధు ఫౌండేషన్ కు 15 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు లీజుకు ఇచ్చింది. జీవో 571 ప్రకారం అప్పటి కలెక్టర్ ఈ సంస్థకు మూడు ఎకరాల భూమి మాత్రమే ఇవ్వాలని తొలుత సిఫారసు చేశారు.. ఆ తర్వాత పైనుంచి వచ్చిన ఒత్తిళ్ళ మేరకు తన సిఫారసులు 10 ఎకరాలకు పెంచారు. ఆ సిఫారసు కూడా కాదని ప్రభుత్వం తన విచక్షణ ఉపయోగించి మరో ఐదు ఎకరాలు జోడించి ఏకంగా 15 ఎకరాలు కట్టబెట్టింది.

10 శాతం వసూలు చేయాల్సిందే

ఇక భూ కేటాయింపుల విధానం మేరకు మార్కెట్ విలువపై 10 శాతం లీజు వసూలు చేయాల్సి ఉంది. అంటే ఏడాదికి దాదాపుగా 50 కోట్ల చొప్పున లీజు నిర్ణయించాల్సి ఉండగా కేవలం 1,47,743గా ఖరారు చేసింది. అంటే 60 సంవత్సరాలకు వచ్చే సొమ్ము 88 లక్షల 64,580 మాత్రమే. ఏడాదికి 50 కోట్ల చొప్పున వసూలు చేస్తూ, అతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్ విలువను సమీక్షిస్తూ వసూలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు 60 ఏళ్లకు గాను వందల కోట్ల ఆదాయం సమకూరేది. పోనీ ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చూసుకుంటే అది కూడా భారీగానే ఉంటుంది. ఆ సొమ్ము మోతాన్ని వదులుకున్న ప్రభుత్వం.. ఆ స్థలంలో భవన నిర్మాణాలకు గానూ కట్టాల్సిన 20 కోట్ల 16 లక్షల 82 వేల ఎనిమిది వందల ఎనభైకి సైతం మినహాయింపు ఇచ్చింది. అంటే ఇది కూడా ప్రభుత్వ ఖజానాకు అదనపు నష్టమే.

ఎంఎన్ జే కే మూడు ఎకరాలు ఇచ్చారు

ఇక క్యాన్సర్ ఆసుపత్రి అనగానే తెలంగాణ ప్రాంత వాసులకు గుర్తుకు వచ్చేది ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి తొలుత కేవలం మూడు ఎకరాల్లో మాత్రమే నిర్మితమైంది. ఆ తర్వాత సేవల విస్తరణలో భాగంగా నిలోఫర్ ఆసుపత్రి నుంచి మరణాలు ఎకరాలు దీనికి కేటాయించారు. అలాంటిది ఆర్థిక అవకతలతో కూడి ఉన్న సాయి సింధు ఫౌండేషన్ కు నగరం నడిబొడ్డున 15 ఎకరాల కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రజాసేవ చేయాలి అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో భూమిని కేటాయించాలంటూ ఆ ఫౌండేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ రాజధాని నగరంలో అత్యంత విలువైన భూమిని కోరడం అనుమానాలకు తావిస్తోంది. ఇక నిర్మించే ఆసుపత్రిలో 25% పడకలను పేదలకు రిజర్వ్ చేస్తామని ఆ ఫౌండేషన్ కోర్టులో గొప్పగా చెప్పింది.. కానీ ఆ నిబంధన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ప్రభుత్వ స్థలం పొందాలంటే తప్పకుండా 25 శాతం పడగలను పేదలకు రిజర్వ్ చేయాల్సిందే. ఆ నిబంధన ప్రకారం భూములు పొంది పేదలకు ఉచితంగా చికిత్స చేయటం లేదంటూ ఇప్పటికే పలుకు ఆసుపత్రులపై కేసులు కోర్టులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయి సింధు ఫౌండేషన్ కు కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిపిన భూ కేటాయింపులకు సంబంధించి విమర్శలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు తాను కూడా అదే బాటను అనుసరించడం విస్మయాన్ని కలిగిస్తోంది.