https://oktelugu.com/

Minister KTR: కేటీఆర్‌కు.. ఏపీ మంత్రికి అదే తేడా!

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రెండు వారాల అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి రెండు వారాలపాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారని సమాచారం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 16, 2023 / 05:26 PM IST

    Minister KTR

    Follow us on

    Minister KTR: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల్లో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తూనే, మరోవైపు వివిధ పథకాల ద్వారా ఎంఎస్‌ఎంఈలకు భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ముఖ్యంగా టీఐడియా, టీప్రైడ్‌ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా ఆర్థిక సహకారం అందిస్తోంది. ఔత్సాహికులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు బ్యాంకర్ల సమన్వయంతో రుణ సదుపాయం కూడా కల్పిస్తుంది.

    హైదరాబాద్‌దే అగ్రస్థానం..
    హైదరాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి, సంగారెడ్డి తదితర జిల్లాల్లోనే ఎంఎస్‌ఎంఈలు ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 65,114 ఎంఎస్‌ఎంఈలు ఉండగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా 854 మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో 8,57,807 మందికి ఉపాధి లభిస్తుంటే, ములుగులో కేవలం 4,762 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న నారాయణఖేడ్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నిర్మల్‌ తదితర జిల్లాలు ఎంఎస్‌ఎంఈల ఏర్పాటులో మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే వెనుకబడి ఉన్నాయి.

    అమెరికా పర్యటనకు కేటీఆర్‌..
    తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రెండు వారాల అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి రెండు వారాలపాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారని సమాచారం. అమెరికాలోని ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈవోలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను వివరించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులపై… కొన్ని కీలక ఒప్పందాలు కూడా జరగనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఇతర అధికారులు కూడా కేటీఆర్‌ వెంట అమెరికా వెళ్లనున్నారు.

    లండన్‌ పర్యటనతో పెట్టుబడులు
    ఇటీవల యూకే పర్యటనకు వెళ్లివచ్చిన కేటీఆర్‌ రాష్ట్రానికి పలు పెట్టుబడులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ దిగ్గజం డాన్జ్‌ హైదరాబాద్‌లో ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసే ఆ కేంద్రంతో 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్‌ సమక్షంలో డాన్జ్‌ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది. బ్రిటన్‌ ఆధారిత ఇన్‌క్రెడిబుల్‌ హస్క్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ రూ.200 కోట్లతో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చింది. రసాయన పరిశ్రమ క్రోడా ఇంటర్నేషనల్‌తోనూ అక్కడ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. జీనోమ్‌ వ్యాలీలో గ్లోబల్‌ టెక్నికల్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. లండన్‌లో జరిగిన ఐడియాస్‌ ఫర్‌ ఇండియా సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌.. తెలంగాణ రాష్ట్ర విధానాలు, అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలతో రాష్ట్రం తొమ్మిదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని సోదాహరణంగా పేర్కొన్నారు.

    వెనుకబడిన దాయాది రాష్ట్రం..
    ఇక తెలంగాణ దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అక్కడి పాలకుల తీరుతో పారిశ్రామికంగా పురోగమించడం లేదు. ఉన్న పరిశ్రమలే అక్కడి నుంచి తరలిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అమరాన్‌ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది. కియా కూడా తరలిపోతుందని ప్రచారం జరిగింది. నిర్ధిష్టమైన పారిశ్రామిక విధానం లేకపోవడం, ప్రణాళిక రూపొందించకపోవడం, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి గుడువాడ అమర్‌నాథ్‌ ఆ శాఖపై పట్టు లేకపోవడం, పెట్టుబడులను ఆకర్షించే నేర్పరితనం లేకపోవడం కొన్ని కారణాలు అయితే.. అక్కడి రాజకీయ పరిణామాలు మరో కారణం.

    ఏపీలో ఉన్న పరిశ్రమలు మూత..
    తెలంగాణవాళ్లకి పరిపాలన చేతకాదని సర్టిఫికేట్‌ ఇచ్చిన ఏపీ రాజకీయ నాయకులు ఇప్పుడు చేస్తున్నదేమిటి? అప్పులపాలైన రాష్ట్రాన్ని నడిపించేందుకు ప్రతీనెల మొదటివారంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని ప్రాధేయపడాల్సి వస్తోంది. ఓపక్క ప్రభుత్వం కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు ఇంటి పన్నులు పెంచేస్తుంటే మరోపక్క రోజురోజుకీ ధరలు పెరిగిపోతున్నాయి. ఇవి సరిపోవన్నట్లు పరిశ్రమలకు పవర్‌ హాలీడేస్, అనధికార కోతలు అమలవుతుండటంతో అవీ నడుపలేని పరిస్థితి నెలకొంది. కరోనా, లాక్‌డౌన్‌తో మూతపడి తీవ్రంగా నష్టపోయిన ఏపీలోని పరిశ్రమలు, మెల్లగా పుంజుకొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పవర్‌ హాలీడేస్‌ పేరిట వారానికి రెండు రోజులు అధికారికంగా, రోజూ అనధికార విద్యుత్‌ కోతలు అమలుచేస్తుండటంతో పరిశ్రమలు నడిపించలేని పరిస్థితి ఏర్పడింది. అవీ మూతపడితే వాటి ద్వారా వచ్చే ఆదాయం తగ్గడమే కాకుండా వాటిలో పనిచేసే వేలాది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉంది.

    తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ..
    ఏపీలో పరిశ్రమలు నడిపించలేని దుస్థితి నెలకొని ఉంటే, ఇదే సమయంలో పొరుగున తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నెల సగటున రూ.200 కోట్లు పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు, ఐటీæ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇటీవలే సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజస్‌ పార్కులో గుజరాత్‌కు చెందిన సహజానంద మెడికల్‌ టెక్నాలజీస్‌ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన స్టెంట్స్‌ పరిశ్రమను ఏర్పాటు చేయడం ఇందుకు తాజా ఉదాహరణ.

    తెలంగాణకే ఎందుకు..
    తెలంగాణకు వేలకోట్లు పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదు? తెలంగాణలో లేని విద్యుత్‌ కొరత ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఎందుకు ఉంది? ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు మూతపడితే ఏపీ పరిస్థితి ఏమిటి?అని ప్రజలు కాదుంపాలకులే ప్రశ్నించుకోవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చూసి ఇప్పుడు తెలంగాణలో గల్లీ స్థాయి నేతలు కూడా నవ్వుతున్నారంటే నవ్వరా మరి!

    గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌తో కాస్త ఉపశమనం..
    విశాఖ నగరంలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని కంపెనీలను ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి గుడువాడ అమర్‌నాథ్‌ కంటే ఈ సమ్మిట్‌లో సీఎం జగన్‌ అన్నీతానై వ్యవహరించారు. దీంతో రూ.13 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి 350కి పైగా కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అయితే ఇవన్నీ ఏర్పాటు అయితేనే ఈ సమ్మిట్‌కు అర్థం ఉంటుంది. ఎంవోయూ కుదుర్చుకున్నంత మాత్రాన పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న గ్యారెంటీ లేదు.