Telangana Elections 2023: గ్రేటర్ హైదరాబాదులో పూర్వవైభవానికి కాంగ్రెస్ తహతహలాడుతోంది. కారు స్పీడ్ కు అడ్డుకట్ట వేసే ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా గట్టి పోటీనే ఇస్తోంది. చివరిసారిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2009లో గ్రేటర్ లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నంలో ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని పార్టీలకు దాదాపు సమాన ప్రాతినిధ్యం ఉంటూ వస్తోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. 2014 తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. అప్పట్లో ఎన్నికల బరిలోకి దిగిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బిక్షపతి యాదవ్, కూన శ్రీశైలం గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర హేమా హేమీలంతా ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా రెడ్డి మాత్రమే గెలుపొందారు. అయితే వీరిద్దరూ అధికార బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు.
2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. 2014 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. అంబర్ పేట, హిమాయత్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ప్రాతినిధ్యం లేదు. ఇక ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, గోషామహల్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ లలో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైంది. పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. నాంపల్లి, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, యాకత్ పుర నియోజకవర్గాలను తొలుత కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అక్కడ ఎంఐఎం పట్టు బిగిస్తూ వచ్చింది. కాంగ్రెస్కు పొట్టున్న నియోజకవర్గంగా మలక్ పేట ఉండేది. క్రమేపి ఆ నియోజకవర్గం కూడా ఎంఐఎం చెప్పు చేతల్లోకి వెళ్లిపోయింది. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో… ఈసారి కనీసం రెండు నియోజకవర్గాలైనా గెలుపొందాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయి. అందుకే ఈసారి గ్రేటర్ లో తప్పకుండా మెజారిటీ స్థానాలను గెలుపొందుతామని కాంగ్రెస్ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే 24 నియోజకవర్గాలకు గాను… 23 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రచారం సైతం ఊపందుకుంది. కేవలం చార్మినార్ స్థానం మాత్రమే పెండింగ్ ఉంది. ఈసారి సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. దీంతో అధికార బీఆర్ఎస్ తో గట్టి ఫైట్ నడుస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రయత్నం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.