Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం రోజుకో విధంగా వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి తాజాగా ప్రకటించడంతో ఉక్కు ఉద్యోగులతోపాటు విశాఖ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే, కొద్ది గంటల వ్యవధిలోనే మళ్లీ ఆ మంత్రి మాట మార్చడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడం లేదని మరోసారి స్పష్టం చేయడంతో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో మార్పు లేదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేయడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు, స్టీల్ ప్లాంట్ కు భూములు ఇచ్చిన వేలాదిమంది నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. స్టీల్ ప్లాంట్ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఒక్కసారిగా ఆనందాన్ని వ్యక్తం చేసిన కార్మిక వర్గాలు..
ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం అనుకోవడం లేదని, ప్లాంట్ ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామంటూ కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ గురువారం చేసిన వ్యాఖ్యలతో కార్మిక వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా విశాఖలో సదరు కేంద్రమంత్రిని కలిసిన పలువురికి కేంద్ర మంత్రి ఈ విధంగా స్పష్టం చేయడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే ప్రక్రియ ఆగుతోందని అంతా భావించారు. ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని, ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. ఈ విషయంలో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా చర్చిస్తామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. అయితే, ఆ తర్వాత కార్మికులు తదితరులతో జరిగిన భేటీలో ఆయన ఈ విషయంపై విస్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో రకరకాల చర్చలకు తేరలేచింది. మంత్రి ప్రకటనతో ప్రైవేటీకరణ ఉంటుందా..? ఉండదా..? అనే దానిపై స్పష్టత కొరవడింది.
ప్రకటనతో ఆ స్పష్టతనిచ్చిన కేంద్రం..
కేంద్ర మంత్రి స్వయంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం లేదంటూ చెప్పడంతో కార్మిక వర్గాల్లో ఆనందం వ్యక్తం అయింది. ఇదంతా ఒకరకంగా బీఆర్ఎస్ పార్టీ బిడ్ లో పాల్గొనేందుకు సిద్ధమవడం వల్లే జరిగిందంటూ చర్చలు జరిగాయి. ఈలోగా కేంద్ర ప్రభుత్వం దీనిపై మరోసారి స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని స్పష్టం చేయడంతో.. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదన్న విషయం అర్థమైంది. తాజా కేంద్ర ప్రకటనతో కార్మిక వర్గాలు మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.