Criminal Laws: బ్రిటిష్ పరిపాలన కాలంలో తీసుకొచ్చిన చట్టాలను బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సమూలంగా మార్చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన ఈ కీలక బిల్లును సభ ముందు ఉంచడం విశేషం. “బ్రిటిష్ వారు తమ పాలనను వ్యతిరేకించే వారిని శిక్షించే ఉద్దేశంతో ఐపిసి, సి ఆర్ పి సి, ఎవిడెన్స్ చట్టాలను రూపొందించారు. ఈ ఉద్దేశం శిక్షించడమే తప్ప.. న్యాయం అందించడం కాదు. ఈడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్య అనుభవాలు, క్రిమినల్ చట్టాల సమగ్ర సమీక్షను కోరుతున్నాయి. అందుకే వర్తమాన అవసరాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చాం. ఎఫ్ ఐ ఆర్ నమోదు నుంచి కేసు డైరీ వరకు, చార్జిషీట్ నుంచి న్యాయం అందే వరకు అన్నీ డిజిటలైజ్ అవుతాయి. 2027 నాటికి అన్ని కోర్టులోనూ కంప్యూటరీ కరణ జరుగుతుంది” అని అమిత్ షా చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మూడు మొబైల్ ఫోరెన్సిక్ లాబరేటరీ లు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. 18 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, హై కోర్టు న్యాయమూర్తులు, 22 న్యాయ విశ్వవిద్యాలయాలు, 142 మంది ఎంపీలు, 270 మంది ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ప్రజలను సంప్రదించి ఈ మూడు బిల్లుల ముసాయిదాలు రూపొందించామని ప్రకటించారు. నాలుగు సంవత్సరాలలో 158 సమావేశాలు నిర్వహించామని, ఈ బిల్లులను మరింత పరిశీలించేందుకు హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన పార్లమెంటరీ స్థాయి సంఘానికి నివేదించాలని స్పీకర్ ఓం బిర్లాను అమిత్ షా కోరారు.
కఠిన వైఖరి
దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈ తరహా ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రం సంకల్పించింది. పెళ్ళి “చేసుకుంటానని, ప్రమోషన్లు ఇప్పిస్తానని మహిళలను లైంగికంగా లొంగ తీసుకోవడం, మారుపేరుతో వ్యవహరించడం నేరం. అత్యాచార నిందితులకు కనీసం 10 సంవత్సరాలు, గరిష్టంగా జీవిత ఖైదు.. సామూహిక అత్యాచారాలకు కనీసం 20 సంవత్సరాలు జైలు లేదంటే జీవించి ఉన్నంతవరకు కారాగార శిక్ష.. అత్యాచారం తర్వాత బాధిత మహిళ మరణించినా లేదా కోమాలోకి వెళ్లినా నిందితుడికి గరిష్టంగా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేలాగా చట్టాన్ని రూపొందించామని” కేంద్రం ప్రకటించింది. 12 సంవత్సరాలకు తక్కువ వయసు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే 20 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది. జరిమానా తో జీవిత ఖైదు లేదా మరణ దండన కూడా విధించవచ్చు. ఎవరైనా పోలీస్ అధికారి లేదా పబ్లిక్ సర్వెంట్, సాయుధ బలగాల సభ్యుడు అత్యాచారానికి పాల్పడితే కనిష్టంగా 10 సంవత్సరాలకు తగ్గకుండా కఠిన కారగార శిక్ష విధిస్తారు. దీనిని జీవిత ఖైదుకు కూడా పొడిగిస్తారు. ఒక పురుషుడు 18 సంవత్సరాలు దాటిన తన భార్యతో లైంగిక క్రియకు పాల్పడటం అత్యాచారం కాదు.
ఎన్నికల నేరాలకు సంబంధించి..
భారతీయ న్యాయ సంహితలో ఎన్నికలకు సంబంధించి ఏకంగా ఒక అధ్యాయాన్ని చేర్చారు . ఓటర్లను ప్రలోభ పెట్టడం లేదా తాయిలాలు స్వీకరించడం లంచానికి సంబంధించిన నేరంగా పరిగణిస్తారు. అయితే ఓటర్లకు ఇచ్చే హామీని ఒక విధానంగా బహిరంగంగా ప్రకటిస్తే దానిని నేరంగా చూడరు. ఎన్నికల నేరాలు, లంచాలు, అభ్యర్థుల వ్యయంలో అవకతవకలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఐపిసి సెక్షన్లు 171ఏ, 171l పరిధిలోకి వస్తున్నాయి. బి.ఎన్.ఎస్ లోని తొమ్మిదవ అధ్యాయంలో వీటిని 165_175 సెక్షన్లలో చేర్చారు.
సంస్థాగత నేరాలివీ
కిడ్నాప్, దోపిడీలు, వాహనాల దొంగతనాలు, మామూళ్ల వసూళ్ళు, భూ కబ్జాలు, కాంట్రాక్టు హత్యలు, ఆర్థిక నేరాలు, తీవ్రమైన సైబర్ నేరాలు, మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారం చేయించడానికి అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, సిండికేట్ బెదిరింపులు, భయపెట్టడం, బల ప్రయోగం, అవినీతి, ఆర్థిక, ఇతర ప్రయోజనాలను ఆశించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం సంస్థ గత నెల కిందకు వస్తాయి. సంస్థాగత నేరానికి పాల్పడినా, అందుకు ప్రయత్నించినా..దాని వల్ల ఎవరైనా మరణించినా.. మరణ శిక్ష లేదా జీవిత ఖైదు తప్పవు. పది లక్షల జరిమానా కూడా విధిస్తారు.
అయితే కేంద్రం మార్చివేసిన ఈ చట్టాలకు సంబంధించి చాలా రోజులు గానే కసరత్తు చేస్తోంది. ఐపిసి, సి ఆర్ పి సి, ఎవిడెన్స్ యాక్టులను సంస్కరించేందుకు కేంద్రం 2020 మార్చిలోనే క్రిమినల్ లా సంస్కరణల కమిటీని నియమించింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం అప్పటి ఉపకులపతి ప్రొఫెసర్ రణ్ బీర్ సింగ్ సారథ్యంలో అప్పటి ఢిల్లీ ఎన్ ఎల్ యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిఎస్ బాజ్ పాయ్, డీఎన్ఎల్ యూ విసి ప్రొఫెసర్ బలరాజ్ చౌహన్, సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ, ఢిల్లీ మాజీ జిల్లా సెషన్స్ మాజీ జడ్జి జీపీ తరేజా ను ఇందులో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ తన అధ్యయన నివేదికను గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా పనిచేసిన పెండ్యాల శ్రీకృష్ణదేవరావు ఆధ్వర్యంలోని కమిటీ అనేక మార్పులు సూచించింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరావు హైదరాబాద్ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి బీసీ గారి నియమితులయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లులను న్యాయ నిపుణులు స్వాగతించారు. దేశంలో కాలం చెల్లిన చట్టాలకు తావు ఉండకూడదని ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సోది అన్నారు. వలస చట్టాలకు కాలదోషం పట్టిందని సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్ వికాస్ పహ్వా అభిప్రాయపడ్డారు.