AP BJP: ఏపీ బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పవన్ ప్రకటనలతో కిం కర్తవ్యం ఏమిటని మదన పడుతున్నారు. ఏపీ బీజేపీలో హేమా హేమీ నాయకులు ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా సీనియర్ నాయకురాలు పురందేశ్వరి ఉండగా.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్య కుమార్ లాంటి నాయకులు ఉన్నారు. కానీ వీరంతా నిమిత్తమాత్రులుగానే మారారు. బిజెపి అగ్రనేతలు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహించాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో సైతం ఏపీ బీజేపీ నేతలు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. పవన్ అసలు తమకు మిత్రుడా? ఆయన కామెంట్స్ పై స్పందించాలా? వద్దా? అన్న విషయం తెలియక తెగ బాధ పడిపోతున్నారు. అటు హై కమాండ్ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు గురించి సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ కు కేంద్ర పెద్దల సహకారం ఉందని బలమైన వాదన వినిపిస్తోంది. అదే సమయంలో పవన్ జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వం అని ప్రకటిస్తున్నారు. ఇది ఏపీ బీజేపీ నేతలకు రుచించడం లేదు. ఒకవైపు ఎన్డీఏ భాగస్వామి అయి ఉండి.. కనీసం సంప్రదించకుండా టిడిపి తో పొత్తు ప్రకటన చేయడం ఏమిటని కొందరు నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అవసరమైతే జాతీయ నేతలతో చర్చిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన చర్చించారు. త్వరలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నందున.. ఏపీ విషయాలు చర్చకి వచ్చే అవకాశం ఉందని.. ఆ సమయంలో అన్ని విషయాలు మాట్లాడదామని పురందేశ్వరి చెప్పినట్లు సమాచారం.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పరిణామాలు బిజెపిని దోషిగా చూపడం పార్టీకి నష్టమని కమలనాధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ సక్సెస్ సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేస్తే తమ వైపు వేలు చూపించడాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సమావేశంలో తీర్మానించారు. జగన్ వెనుక కేంద్ర పెద్దలు ఉన్నారని ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని.. దానిని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బిజెపి అగ్రనేతలు ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు కోరినట్లు సమాచారం. బిజెపి బలోపేతం, వైసిపి ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటం చేయాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అటు సమావేశం అనంతరం మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలను కేంద్ర పెద్దలతో చర్చిస్తామని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి వ్యాఖ్య పైన తాను స్పందించనని.. పొత్తుల అంశం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తేల్చి చెప్పారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు, అటు కేంద్ర పెద్దల వైఖరితో ఏపీ బీజేపీ నేతలు సతమతమవుతున్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం చర్యలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు కూటమి వైపు అడుగులు వేయాలని భావిస్తున్నారు. మొన్నటి వరకు ఎన్డీఏ అంటూ మాట్లాడిన పవన్.. ఇప్పుడు టిడిపి, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో కేంద్ర పెద్దలకు లింక్ ఉందని ప్రచారం ఊపొందుకుంటుంది. దీంతో ఏపీ బీజేపీ నేతలకు ఎటువైపు అడుగులు వేయాలో తెలియడం లేదు.రాజకీయంగా నష్టం తప్పదని వారు భావిస్తున్నారు.