AAP – KCR : ఆమ్ ఆద్మీ పార్టీ.. అవినీతి రహిత సాలనే లక్ష్యంగా ప్రారంభించిన పార్టీ. స్థాపించిన తొలి ఏడాదే ఢిల్లీ పీఠం దక్కించుకున్న పార్టీ.. ఈ క్రమంలో అనతికాలంలోనే పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ప్రజల్లో మంచి గుర్తింపు పొందాడు. దీంతో వరుసగా రెండుసార్లు పార్టీని ఢిల్లీలో అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో పార్టీని విస్తరిస్తూ వస్తున్నారు. ఉత్తర భారత దేశంలోని హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని వివిధ ఎన్నికల్లో పోటీ చేసింది. గోవాలో గత ఎన్నికల్లో మంచి సీట్లు గెలుచుకుంది. దీంతో ఇటీవలే ఎన్నికల సంఘం ఆప్‌ను జాతీయ పార్టీగా గుర్తించింది. అయితే జాతీయ గుర్తింపు రాకమేందే ఏడాది క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ అధినేత ప్రకటించారు. ఈమేరకు పార్టీ బలోపేతం, కమిటీ, కార్యవర్గం ఏర్పాటు చేశారు. కానీ ఏడాదిలో అనూహ్య పరిణామాలు మచ్చలేని ఆప్ పార్టీ ప్రతిష్టను ఘోరంగా దిగజార్చాయి.
లిక్కర్ స్కాంతో అవినీతి మరక..
ఢిల్లీ మద్యం పాలసీలో చేసిన మార్పులు, అందులో జరిగిన అవినీతిపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడంతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగడం, భారీ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం ఆప్ పార్టీకి పెద్ద మచ్చగా మారింది. ఇప్పటికే ఆప్‌కు చెందిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మంత్రి అరెస్ట్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా మూడు రోజుల క్రితం ఈ కేసు విషయమై ఈడీ నోటిసులు ఇచ్చింది.
ఢిల్లీకే పరిమితం కాలేదు..
అవినీతి, ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుకు దూరంగా ఉండే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. లిక్కర్ పాలసీలో తప్పటడుగు వేశారు. కాదు కాదు.. ఆయనతో తప్పటడుగు వేయించారు. ఇందులో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. ఈ సౌత్ గ్రూపుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వం వహించారు. పాలసీ మార్పులో కీలకంగా వ్యవహించారు. ఇందులో ఏపీకి చెందిన ఎంపీ, ఆయన కొడుకు, విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు తదితరులు ఉన్నారు. వీరంతా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. అరెస్ట్ కూడా అయ్యారు.
ఒక్క కవిత మినహా..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాత్ర ఉన్నట్లు ఈడీ గుర్తించినవారిలో 90 శాతం మంది మందిని ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ నుంచి ఎంపీ కొడుకు మాగుంట రాఘవ కూడా జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. కానీ, తెలంగాణ నుంచి కవిత కూడా మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ ధ్వంసం చేసినట్లు పేర్కొన్న తన ఫోన్లను కూడా అప్పగించారు. తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో కాస్త రిలాక్స్‌గా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు విచారణపై మాత్రమే స్టే ఇచ్చింది. అరెస్ట్ ఆపమనలేదు.
చేతులు కలిపిన కేసీఆర్ కేజ్రీవాల్..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పుణ్యాన పొత్తుల రాజకీయాలకు దూరంగా ఉండే అరవింద్ కేజ్రీవాల్ ఒక్క తప్పటడుగు వేసి దొరికిపోయారు. దీంతో రక్షణ కోసం విపక్ష కూటమిలో చేరక తప్పలేదు. అంతకు ముందు అనేక ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్న కేజ్రీవాల్, లిక్కర్ స్కాం నుంచి తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో విపక్షాల పంచన చేరారు. ఈ క్రమంలో కుంభకోణానికి తెరతీసిన కల్వకుంట్ల కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కావడంతో కేసీఆర్‌తోనూ చేతులు కలిపారు.
ఎన్నికల్లో అందుకే దూరం..
గతంతో తెలంగాణలో పోటీకి సై అన్న ఆప్.. లిక్కర్ స్కాం కారణంగా ఇప్పుడు సౌత్‌లో పోటీకి ఆసక్తి చూపడం లేదు. తాను పోటీ చేయడం వలన బీఆర్‌ఎస్ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ సూచన మేరకే ఆయన తెలంగాణ ఎన్నికల బరిలో నిలవలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఇండయా కూటమిలో ఉన్న కేజ్రీవాల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలోని బీఆర్‌ఎస్ ఇండియా కూటమిలో లేకపోయినా పోటీకి దూరంగా ఉండడం కేసీఆర్, కవిత కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.