మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు భారీగా నామినేషన్లు వేశారు. అయితే.. ఎన్నికలంటే భయపడుతున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ స్థానం నుంచి పీవీ కుమార్తె వాణీదేవిని అభ్యర్థిగా నిలబెట్టారు కేసీఆర్. అయితే.. ఇప్పుడు కేసీఆర్‌లో టెన్షన్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుందా..? : తిరుపతి సీటు జనసేనకేనా..?
గెలిపించకపోతే ఓడిపోయే సీటు ఇచ్చామంటారు. పీవీని అవమానించారని విమర్శలు గుప్పిస్తారు. ఏ లక్ష్యం కోసం అయితే పీవీకి అత్యున్నత గౌరవం ఇస్తూ కార్యక్రమాలు చేస్తున్నారో అది దెబ్బతినే ప్రమాదం వస్తుంది. అందుకే.. కేసీఆర్ ఇప్పుడు వాణీదేవి విజయం కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. ఎన్నికల పూర్తి బాధ్యతను మంత్రులకు అప్పగించారు. వాణీదేవిని ఎన్నికల్లో పోటీకి ఒప్పించడానికి టీఆర్ఎస్ నేతలు కష్టపడాల్సి వచ్చింది.
ఆమె సరేనని ఒప్పుకోవడంతో నామినేషన్ సైతం వేయించారు. ఇక ఇప్పుడు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని తామే చూసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం.. అభ్యర్థి ప్రచారం చేయడం కష్టం. దీంతో మంత్రులే అభ్యర్థులుగా భావించి రంగంలోకి దిగాల్సి ఉంది. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాకు మంత్రి ప్రశాంత్ రెడ్డిని , రంగారెడ్డి జిల్లాకు హరీష్‌రావును ,హైదరాబాద్ జిల్లా బాధ్యతలను గంగుల కమలాకర్‌కు అప్పగించారు.
Also Read: ఊపందుకున్న ‘రియల్’ బిజినెస్ : హాట్ కేకుల్లా ఫ్లాట్ల అమ్మకాలు
ఇక.. మరో ఎమ్మెల్సీ స్థానమైన వరంగల్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అక్కడ కేసీఆర్ దృష్టి పెట్టాల్సిన అవసరం పెద్దగా లేదు. అందుకే కేసీఆర్ తన దృష్టి మొత్తం వాణీదేవి గెలుపుపై పెడుతున్నారు. ఇందుకోసం ఆయన రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. అభ్యర్థిని నిలపకుండా.. ప్రొ.నాగేశ్వర్ కో మరొకరికో మద్దతు ప్రకటించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టి అనవసర ప్రయోగం చేసి.. రెండు విధాలా నష్టం తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని టీఆర్ఎస్‌లోని ఓ వర్గం గుసగుసలాడుతోంది. చివరికి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్