Repairs For Deva Bhoomi: సమ భావం, సమానత్వం అంటూ కమ్యూనిస్టులు ఏవేవో చెప్తుంటారు కానీ.. వారు సుద్ధ పూసలు ఏమీ కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులకు అధికారం ఉన్నది ఒక్క కేరళలో మాత్రమే. ఇప్పుడు అక్కడ పినరయ్ విజయన్ కు రోజులు ఏమంత బాగోలేనట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న బంగారం స్కాం లో ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఇరుక్కున్న తీరు చూశాం కదా! ఇప్పుడు అది మర్చిపోకముందే తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ పినరయ్ విజయన్ సర్కారు అవినీతి మూలాలు, క్యాసినో పేరుతో ఓ ముఠా సాగిస్తున్న ఆగడాలను పెకిలించే పనిలో పడ్డాడు.

..
ఇంతకీ ఏం జరిగింది
..
మొన్న నోయిడాలో జంట టవర్ల పేల్చివేత చూశాం కదా! అలాంటి టవర్లు ఇండియాలో బోలెడు. ప్రజా ప్రతినిధులే అనుమతులు ఇస్తారు. అధికారులు లంచాలు తీసుకుంటారు. ఆపై క్రమబద్ధీకరిస్తున్నామని చెబుతుంటారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు న్యాయ వ్యవస్థ చర్నాకోలు తో కొడుతూ ఉంటుంది అప్పుడు ఇక ఏ అధికార మంత్రాంగం ఏమీ చేయలేదు. మొన్న నోయిడా ట్విన్ టవర్స్ విషయంలో జరిగింది ఇదే. ఇప్పుడు ఆలాంటిదే కేరళలో జరుగుతోంది.
కేరళలోని అలప్పుళ జిల్లా లో పనవెళ్ళి గ్రామ పంచాయతీ పరిధిలో వెంబనాడ్ సరస్సు మధ్యలో ఒక దీవి ఉంటుంది. 14 ఏళ్ల క్రితం అంటే 2008లో క్యాపికో రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఎటువంటి అనుమతిలేకుండా 17 ఎకరాల్లో విలాసవంతమైన విల్లాలు నిర్మించింది. ఒక్కో విల్లా వైశాల్యం 5,900 చదరపు అడుగుల చొప్పున మొత్తం 54 భారీ విల్లాలు.. స్విమ్మింగ్ పూల్, ఇతర కట్టడాలు నిర్మించింది. మొత్తం ఈ రిసార్ట్ విలువ 200 కోట్లకి పై గానే. 7 స్టార్ రిసార్ట్ గా పేరున్న ఈ క్యాపికో లో ఒక్క రోజు బసకు 55 వేల నుంచి లక్ష దాకా వసూళ్ళు చేస్తారు. భారత్ లో టాటా, బర్లాల మాదిరిగా కువైట్ లో క్యాపికోలు ఆగర్భ శ్రీమంతులు. దాంతో మనకి అడ్డు అదుపు ఉండదు అనుకున్నారు. పైగా అధికారుల పై ఉన్నత స్థాయిలో ఒత్తిళ్ళు. ఆ రిసార్ట్ కూల్చివేయాలని కోర్టు ఆదేశాలు జారిచేసినా ఏ ఒక్క అధికారి ముందుకు రాలేదు. కానీ సరిగ్గా నెల క్రితం అలప్పుళ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మైలవరపు కృష్ణ తేజ అనే తెలుగు ఐఏఎస్ ఆ అక్రమాల అంతు చూస్తున్నారు. మొన్న గురువారం నాడే ఆ జిల్లాల కూల్చివేత పనులను ప్రారంభించారు. ఈ రాష్ట్రం వాడివి కాదు. ఎవరూ చేయని సాహసం నీకెందుకంటూ ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా తగ్గేదేలే అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
..
నిబంధనలు పాటిస్తే కదా
..
వెంబనాడ్ సరస్సు మధ్యలో సముద్రానికి చేరువలో 2.93 హెక్టార్ల వైశాల్యంలో ఒక ద్వీపం ఉంది. స్థానిక జాలరులు ఆ ద్వీపాన్ని ఉపయోగించుకునేవారు. క్యాపికో యాజమాన్యం 2007లో ఆ దీవి పై హక్కులు సాధించుకున్నది. మూడు ఎకరాల్లో రిసార్ట్ నిర్మిస్తామని వనవెల్లి పంచాయతీ నుంచి అనుమతులు సాధించింది. ఆ ప్రాంతం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉంది. కోస్టల్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. 2007లో మూడు ఎకరాల్లో విల్లాలు నిర్మిస్తామని చెప్పిన క్యాపికో యాజమాన్యం ప్రభుత్వానికి చెందిన మరో ఎకరాలను కలుపుకొని మొత్తం దీనిపై గుత్తాధిపత్యానికి కుట్ర పన్నింది. ఇలా మొత్తం 17 ఎకరాల్లో విల్లాలు, కార్యాలయాలు, స్విమ్మింగ్ పూల్స్ నిర్మించింది. దీనిపై స్థానిక జాలరులు పోరాటం చేశారు. వారిని క్యాపికో యాజమాన్యం భయపెట్టింది. కానీ ఓ ఐదుగురు యువ జాలరులు మాతృ సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కోర్టుల్లో ఈ నిర్మాణాలను సవాల్ చేస్తూ ఫిర్యాదు చేశారు. వీరికి కొందరు ప్రకృతి ప్రేమికులు తోడు కావడంతో హై కోర్టులో విజయం సాధించారు. 2013లో హైకోర్టు తన తీర్పులో ఆ రిసార్ట్ ను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రిసార్ట్ యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీంతో హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధించింది. 2013లో ఈ తీర్పు వెలువడింది. కానీ ఆ రిసార్ట్ వైపు ఈ ఒక్క అధికారి కన్నెత్తి కూడా చూడలేదు. పైగా ఉన్నతాధికారుల నుంచి, ప్రభుత్వ పెద్దలనుంచి ఫోన్లు రావడంతో కింది స్థాయి అధికారులు మాకెందుకులే అని మిన్నకుండిపోయారు. ఇదే సమయంలో కోవిడ్ విజృంభించడంతో సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో పడిపోయింది.
..
తెలుగు కలెక్టర్ దెబ్బకు..
..
గత నెల మూడో తారీఖున అలప్పుళ కలెక్టర్ గా కృష్ణ తేజ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కోర్టు కేసులు, తీర్పులు, వాటి అమలు తీరుపై దృష్టి సారించారు. అదేవిధంగా క్యాపికో రిసార్ట్ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని ప్రభుత్వాన్ని గుర్తించారు. గత వారమే ఆ దీవిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ఆరు నెలల్లో రిసార్ట్ కూల్చివేత పనులు పూర్తవుతాయని వివరించారు. కూల్చివేతలన్నీ పర్యావరణహితంగా జరగాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. శిథిలాలకు సంబంధించి ఒక్క ఇసుక రేణువు సరస్సులో పడినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అన్నట్టు ఈ రిసార్ట్ కూల్చివేత పనుల ఖర్చు మొత్తం యాజమాన్యమే భరిస్తుంది. ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వదు. ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. నిలపరా నీ జాతి నిండు గౌరవం.. అన్నట్టు కేరళలో తెలుగువాడైన కృష్ణ తేజ తెలుగు జాతి గౌరవం నిలబెడుతున్నాడు. కానీ అదే సమయంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీలు, కలెక్టర్లు ముఖ్యమంత్రిని, మంత్రిని వెయ్యినోళ్ల పొగుడుతున్నారు. అతడు తెలుగువాడే. వీరు తెలుగువాళ్లే. అయినప్పటికీ ఎంత తేడా!