YCP Vs TDP: వైసీపీకి తెలుగుదేశం పార్టీ గట్టిగానే దెబ్బ కొట్టినట్టుంది. లేకుంటే సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా మీడియా ముందుకు వచ్చారు.టిడిపి ఓటర్లపై ప్రభావం చూపేలా సర్వే చేస్తుందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. టిడిపి సేవా మిత్ర యాప్ స్క్రీన్ షాట్ తీసుకువచ్చి ఏదేదో జరిగిపోతోందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల డేటా చోరీకి గురవుతుందని గగ్గోలు పెట్టారు.
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో జనసేన ను కలుపుతూ 11 అంశాలపై మినీ మేనిఫెస్టోను రూపొందించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ఇంటింటా సర్వే చేపట్టారు. ఇంట్లో ఉన్న వారి ఫోన్ నెంబర్లు, పేర్లతో కూడిన వివరాలు తెలుసుకున్నారు. వాటిని నమోదు చేసుకున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మనిషికి లక్ష నలభై ఎనిమిది వేల రూపాయల లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. ఫోన్ నెంబర్ నమోదైతే చాలు 2024 జూన్ నుంచి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ పథకాలు ప్రారంభమవుతాయని చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఆసక్తిచూపుతున్నారు.ఇది వైసీపీకి మింగుడు పడడం లేదు. తమ ఓటు బ్యాంకుకు గండి తప్పదని బెంగ వెంటాడుతుంది.
ఇప్పటికే మధ్యతరగతి,ఉన్నత వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అటు వైసిపి ప్రభుత్వం సైతంవీరు తమ ఓటు బ్యాంకు కాదని తేల్చేస్తుంది. తమ ఓటు బ్యాంక్ అంతా సంక్షేమ పథకాలు అందుకునే పేదలేనని బలంగా నమ్ముతోంది. ఇప్పుడు అదే వర్గంలో టిడిపి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్తు గ్యారెంటీ పేరిటవివరాలు నమోదు చేసుకుని ఒక రసీదు చేతిలో పెడుతుంది. 2024 జూన్ నుంచి మీ పథకాలు ప్రారంభమవుతాయని… మీరు బటన్ నొక్కి ఒక్కసారి మద్దతు తెలపాలని కోరుతున్నారు. దీంతో పేద వర్గాల నుంచి భారీగా స్పందన వస్తోంది.దీంతో వైసీపీలో కలవరపాటు ప్రారంభమైంది.
అయితే దీనిని గుర్తించిన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి టిడిపి పై ఆరోపణలు చేశారు. టిడిపి వివరాల నమోదు ప్రక్రియను తప్పుపడుతున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి వెళ్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఫ్రస్టేషన్ తో మాట్లాడారు. టిడిపి మేనిఫెస్టో ప్రకటించడం తప్పు.. దానిపై ప్రచారం చేయడం తప్పు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. మొత్తానికైతే టిడిపి ప్రయత్నంతో వైసీపీకి ఎక్కడో కాలుతున్నట్లుంది. తమ కొంప ములుగుతుందన్న భయం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.