దేశంలోని అంతర్జాతీయ స్థాయి నగరాల్లో హైదరాబాద్ ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఉపాధి కోసం వచ్చేవాళ్లనే కాదు.. ప్రాణాపాయంతో వచ్చేవాళ్లను సైతం కడుపున దాచుకుంటుంది భాగ్యనగరం. కొవిడ్ పరిస్థితులే ఇందుకు ప్రధాన సాక్ష్య. మొదటి దశలో కరోనా పెచ్చరిల్లింది మొదలు నిన్నా మొన్నటి వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు హైదరాబాద్ కే క్యూ కట్టారు.
ప్రధానంగా.. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ పైనే ఆధారపడి ఉన్నారు. సరిహద్దులోని ఈ రాష్ట్రాల ప్రజలకు తమ రాజధానులు చాలా దూరం. అందువల్ల సాధారణ సమయాల్లోనూ అందరూ తమ అవసరాలకోసం హైదరాబాద్ వైపే చూస్తుంటారు. అలాంటిది.. కొవిడ్ సోకి ప్రాణాయస్థితిలో ఉంటే ఇంకెలా ఉంటారు? అందుకే.. అంబులెన్సులు కట్టించుకొని అందరూ హైదరాబాద్ చేరిపోతున్నారు.
ఇలా ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా వందలు దాటి వేలకు చేరినట్టు సమాచారం. హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మొత్తం రోగుల్లో.. దాదాపు సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సమాచారం. ఈ పరిస్థితి రాను రానూ పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర రాష్ట్రాల వారే ఆసుపత్రుల్లో నిండిపోతుండడంతో.. తమ రాష్ట్రం ప్రజలకు ఇబ్బంది ఎదురవుతుందని కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సులను సరిహద్దుల్లోనే ఆపేయాలనే అసాధారణ నిర్ణయాన్ని సైతం తీసుకుంది. అయితే.. ఇటీవల సుప్రీంలో ఓ అఫిడవిట్ ను దాఖలు చేసింది కేంద్రం. దానిప్రకారం.. దేశ ప్రజలు ఎక్కడైనా చికిత్స పొందే అవకాశం ఉండడంతో.. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పలేదని సమాచారం.
అయితే.. ఇకపై అనుమతి ఉన్న అంబులెన్సులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మానవతాదృక్పథంతో ఇతర రాష్ట్రాల వారికీ వైద్యం అందిచినప్పటికీ.. తమ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా.. ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట తెలంగాణ సర్కారు.