పీసీసీ రేస్: రేవంత్ కు దక్కకుండా రంగంలోకి సీనియర్లు

‘100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దెబ్బతీయాల్సిన పనిలేదని.. కాంగ్రెస్ నేతలే దెబ్బతీసుకుంటారని’ రాజకీయ వర్గాల్లో ఓ ఫేమస్ సామెత ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశంలో.. రాష్ట్రంలో అసలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న అనుమానం సగుటు నాయకుల్లో నెలకొంది.. కరోనా-లాక్ డౌన్ ఏ కాంగ్రెస్ నాయకుడు బయటకు రావడం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనడం లేదు. పదవుల విషయం వచ్చేసరికి మాత్రం తాజాగా బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తమకే […]

Written By: Neelambaram, Updated On : May 31, 2020 5:21 pm
Follow us on


‘100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దెబ్బతీయాల్సిన పనిలేదని.. కాంగ్రెస్ నేతలే దెబ్బతీసుకుంటారని’ రాజకీయ వర్గాల్లో ఓ ఫేమస్ సామెత ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశంలో.. రాష్ట్రంలో అసలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న అనుమానం సగుటు నాయకుల్లో నెలకొంది.. కరోనా-లాక్ డౌన్ ఏ కాంగ్రెస్ నాయకుడు బయటకు రావడం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనడం లేదు. పదవుల విషయం వచ్చేసరికి మాత్రం తాజాగా బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తమకే ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యర్థులకు దక్కకుండా లాబీయింగ్ చేస్తున్నారు.. అలా కష్టకాలంలో రాని వీరంతా.. పదవుల భర్తీ సమయం వేళ బయటకొస్తుండడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇస్తే గిస్తే కాంగ్రెస్ లో అనాదిగా ఉన్న మాకే పీసీసీ పదవి ఇవ్వాలి.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో దూకుడుగా ప్రవర్తిస్తున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఇదే డిమాండ్ తో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా ఒక్కటవుతున్నారు. అవును.. పీసీసీ చీఫ్ రేసులో అయితే ఉత్తమే ఉండాలి.. లేదంటే తమలో ఒకరిని చేయాలి. అంతేకానీ రేవంత్ రెడ్డిని చేయడానికి వీల్లేదని తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయని.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముందని.. రేవంత్ ను చేయవద్దని రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని తేల్చిచెప్పారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వడానికి అభిప్రాయాలు కోరుతున్నారని జగ్గారెడ్డి బాంబు పేల్చారు. రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే తాను వ్యతిరేకిస్తానని జగ్గారెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడం సంచలనమైంది.

రేవంత్ రెడ్డికి తప్పించి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని జగ్గారెడ్డి అనడం చర్చనీయాంశమైంది. పీసీసీ రేసులో ఆది నుంచి కాంగ్రెస్ వాదులకే ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే కోమటిరెడ్డి సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని.. రేవంత్ కు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ సీనియర్లు వీహెచ్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు సహా పెద్దలంతా పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి దక్కకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదివరకే కరోనాకు ముందు ఈ నియామకాన్ని ఆపేశారు. ఇప్పుడు మరోసారి అధిష్టానం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండడంతో మరోసారి కాంగ్రెస్ సీనియర్లంతా ఏకమవుతున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ కాకుండా అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

-నరేశ్ ఎన్నం