https://oktelugu.com/

Telangana Health Director : మందుల కంటే మంత్రాలకే విలువ.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కథే వేరు

Telangana Health Director : పిచ్చి నెత్తికి ఎక్కింది. తలకి రోకలి చుట్టండి అనే ఒక సామెత ఉండేది..ఇప్పుడు దీనిని రాష్ట్ర హెల్త్ డైరైక్టర్ కు వర్తింప చేయాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు అలా ఉన్నాయి మరీ. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శాస్త్రీయంగా మందులు వేసుకుంటే రోగాలు పోతాయని చెప్పాల్సింది పోయి తాయత్తులు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్నట్టు మాట్లాడుతున్నాడు. మొన్నటికి మొన్న ఏసు క్రీస్తు దయవల్లే కరోనా తగ్గిందని అన్నారు. ఇప్పుడు తాయత్తుల వల్లే తాను […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2023 / 07:55 PM IST
    Follow us on

    Telangana Health Director : పిచ్చి నెత్తికి ఎక్కింది. తలకి రోకలి చుట్టండి అనే ఒక సామెత ఉండేది..ఇప్పుడు దీనిని రాష్ట్ర హెల్త్ డైరైక్టర్ కు వర్తింప చేయాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు అలా ఉన్నాయి మరీ. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శాస్త్రీయంగా మందులు వేసుకుంటే రోగాలు పోతాయని చెప్పాల్సింది పోయి తాయత్తులు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్నట్టు మాట్లాడుతున్నాడు. మొన్నటికి మొన్న ఏసు క్రీస్తు దయవల్లే కరోనా తగ్గిందని అన్నారు. ఇప్పుడు తాయత్తుల వల్లే తాను బతికానంటూ మరోసారి అదే తీరులో వ్యాఖ్యానించింది..
    ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన డాక్టర్ గడల శ్రీనివాసరావు చేస్తున్న విచిత్ర వాఖ్యలు ఎప్పుడు మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన స్పీచ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సెలవు వస్తే చాలు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాలిపోతున్నాడు. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంలో తనకంటూ ఒక మార్క్‌ను సొంతం చేసుకోవాలని ఉబలాట పడుతున్నాడు. జీఎస్‌ఆర్‌ ట్రస్టు పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఉచిత వైద్యశిబిరాలు, ఉద్యోగమేళాలు, పండుగలు, ఉత్సవాలు ఇతరత్రా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇది చాలదన్నట్లు హోదాను మరిచి ఏదో ఒక సంచలన వాఖ్యలు చేస్తూ ఎప్పుడూ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాడు.
    “డాక్టర్లు నయం చేయలేని జబ్బును ఒక తాయత్తు చేసిందని, తాయత్తు కట్టుకోబట్టే బతికి ఈ స్థాయిలో ఉన్నాను” అంటూ తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాస్‌ మరోసారి విచిత్ర వాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో పాల్గొన్న ఆయన ఈ వాఖ్యలు చేశారు. తనకు చిన్నతనంలో దెబ్బతగిలి రక్తస్రావమైందని, డాక్టర్లు దగ్గరకు వెళ్తే సమస్య కష్టంగా ఉందని మా ప్రయత్నం మేము చేస్తున్నామని.. అంతా ఆ భగవంతుడి దయ అన్నారన్నారు. దీంతో తన తాత దగ్గరలోని ఒక మసీదుకు తీసుకెళ్లి మౌలాసాబ్‌తో ఒక తాయిత్తు కట్టించడంతో అవి తగ్గాయని, ఆ తాయత్తు మహిమతో ఈరోజు ఈస్థాయిలో ఉన్నానన్నారు. రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ స్థాయిలో ఉన్న వ్యక్తి డాక్టర్లుతో నయం కానిది తాయత్తుతో అయిందనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
    ఫిబ్రవరి 12న కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో జరిగిన జర్నలిస్టుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో.తాను భద్రాచలం ఏరియా వాడినని, తన పెరుగుదల అంతా అన్నల అడుగుజాడల్లో జరిగిందన్నారు. గన్‌ పట్టుకునే వాడిని దారి తప్పి స్టెతస్కోప్‌ పట్టుకున్నాని, కానీ గన్‌పట్టుకుంటే అన్నల్లోకి పోయి ఈ పాటికి “శ్రీనివాస్‌ అమర్ రహే” అనేవారని అంటూ అందరిని అశ్చర్యపరిచేలా మాట్లాడారు.
    గత ఏడాడి డిసెంబర్‌ 21తేదీన కొత్తగూడెం శ్రీనగర్‌ పంచాయతీలోని తన నివాస ప్రాంగణంలో జరిగిన సెమిక్రిస్మస్‌ వేడుకల్లో డీహెచ్‌ మాట్లాడుతూ “యేసుక్రీస్తు దయతోనే కరోనా తగ్గుముఖం పట్టిందన్నా”రు… భారత దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని, ఆ మతమే లేక పోతే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయి ఉండేదని హితవు పలికాడు.
    గత ఏడాది ఏప్రిల్‌ 6వ తేదీన కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్‌ మండలంలో ఓ విచిత్ర హోమ పూజల్లో గడల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తనకు తాను దేవతగా మారిన ఎంపీపీకి దండం పెట్టి ఆమె చుట్టూ, హోమం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. క్షుద్ర పూజల్లో డీహెచ్‌ పాల్గొన్నారంటూ సాగిన  ప్రచారం అప్పట్లో సంచలనం లేపింది. దీంతో తనకు తాను దేవతగా ప్రకటించుకున్న వ్యక్తి పూజల్లో ఒక హెల్త్ డైరెక్టర్‌ పాల్గొనటం ఏమిటని పలువురు ప్రశ్నిచడంతో గడల జవాబు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    గత ఏడాది నవంబర్‌ కొత్తగూడెంలో జరిగిన మున్నూరుకాపు కార్తీక వనసమారాధన మహోత్సవంలో పాల్గొన్న గడల శ్రీనివాస్‌ మాట్లాడారు.” ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు ఒక్కసారికాదు బరాబర్‌ వందసార్లు మొక్కుతా… కేసీఆర్‌ తన పితుృ సమానులని, ఆయన పాద పద్మాలను తాకడం తన అదృష్టమని” వ్యాఖ్యానించాడు. దీనిపై ప్రతిపక్ష నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి ఇటువంటి పనులు చేయడం ఏమిటని, అంతలా ఇష్టం ఉంటే పదవికి రాజీనామా చేసి ఏమైనా చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రతీ సారి తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌ ఏదో ఒక వివాదస్పద, విచిత్ర వాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారాడు. ఇదంతా మీడీయాలో ఫ్రీ పబ్లిసిటీ కోసమేనని ప్రజలు కామెంట్‌ చేస్తున్నారు. ఇలా మాట్లాడటం ఆయనకు సర్వ సాధారణమైందని, బాధ్యాతాయుత ప్రభుత్వ ఉన్నత ఉద్యోగిగా విదులు నిర్వర్తించాల్సిన వ్యక్తులు స్థాయిని మరిచి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారని.. ప్రచారం కోసం చేస్తున్న వాఖ్యలుగా ప్రజలు కొట్టి పడేస్తున్నారు.