Telangana Elections 2023: శక్తిపీఠం అలంపూర్.. జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్న ఈ నియోజవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ఆసక్తికరంగా మారుతున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలతోపాటు స్వతంత్రంగా సైతం చట్టసభలకు వెళ్లడానికి రాజ్యాంగం అవకాశం కల్పించగా.. ఆ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని అనేకమంది స్వతంత్రులు పోటీకీ సై అంటున్నారు. ప్రధానంగా అలంపూర్ నియోజకవర్గంలో జాతీయ, రాష్ట్రీయ పార్టీలతోపాటు స్వతంత్రులు పోటీలో నిలిచారు. చాలావరకు వారు ఓటమి చవిచూసినప్పటికీ.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు.
ఇండిపెండెంట్ ఈజీ కాదు..
కేవలం ఒక వ్యక్తిగా నిలిచి శక్తిగా ప్రభంజనం సృష్టించడం ప్రజల మన్ననలు పొందడం స్వతంత్రలకు కత్తిమీద సాములాంటింది. కానీ, ఇక్కడ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతోపాటు స్వతంత్రులు సైతం పోటీకి సై అంటున్నారు. కొందరు వారి ప్రభావం చూపగా.. మరికొందరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. 1952లో తొలిసారి అలంపూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. తొలినాళ్లలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలంపూర్ మండలం లింగనవాయికి చెందిన కలవండ్ల డాక్టర్ నాగన్న పోటీ చేయగా ప్రత్యర్థిగా జమ్మన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో జమ్మన్న స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ రెండవ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఏడాదిలోనే అనగా 1953లోనే రెండవ సారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ నాగన్న, ప్రత్యర్థిగా స్వతంత్ర అభ్యర్ధి జమ్మన్న పోటీపడ్డారు. అప్పటి పరిస్థితుల్లో జమ్మన్న రెండవ స్థానం దక్కించుకున్నారు.
1957లోనూ...
1957లో అలంపూర్ జనరల్ స్థానంగా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జయలక్ష్మిదేమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డి పోటీ చేశారు. జయలక్ష్మిదేవమ్మకు 13,345 ఓట్లు.. స్వతంత్ర అభ్యర్ధి జనార్ధన్‌రెడ్డికి 13,267 పోల్‌కాగా.. కేవలం 78 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి ఓటమి చెందారు. దీనిని బట్టి ఎంతటి గట్టి పోటీ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 1962లో కాంగ్రెస్ అభ్యర్థి మురళీధర్‌రెడ్డికి 20,715, స్వతంత్ర అభ్యర్థి పాగపుల్లారెడ్డి 20,548 ఓట్లు వచ్చాయి. 167 ఓట్ల తేడాతో పాగపుల్లారెడ్డి ఓటమి చవి చూశారు.
17 సార్లు ఎన్నికలు.. ఏడుసార్లు ప్రభావం..
నియోజకవర్గంలో 17 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించినప్పటికీ దాదాపు ఏడు సార్లు ప్రధాన పార్టీ అభ్యర్థులకు చుక్కలు చూపించారు. గెలుపు నీదా.. నాదా అన్నట్లుగా కౌంటింగ్ సాగింది. మొత్తానికి అలంపూర్ నియోజకవర్గంలో స్వతంత్రులుగా పోటీ చేసిన చాలామంది తమ ప్రత్యేకతను చాటారు.
1967లో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డికి 35,780 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్ధి జనార్ధన్ రెడ్డికి కేవలం 4330 ఓట్లు వచ్చాయి. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డికి 37,438 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి శ్రీరామరెడ్డికి 15,268 ఓట్లు పోలయ్యాయి. 1978లో జనతా పార్టీ అభ్యర్థి చల్లా రాంభూపాల్ రెడ్డికి 23,998 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి రజనిబాబుకు 23,873 ఓట్లు రాగా 125 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2004లో టీడీపీ అభ్యర్ధిగా వావిలాల సునిత స్వతంత్ర అభ్యర్థిగా చల్లా వెంకట్రామిరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి 33,252 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధి చల్లా వెంకట్రామిరెడ్డికి 37,499 ఓట్లు పోలవ్వగా.. చల్లా వెంకట్రామిరెడ్డిని 4,247 ఓట్లతో విజయం వరించింది.
ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ..
అలంపూర్‌లో దాదాపు స్వతంత్రులు 52 ఏళ్లపాటు పోరాటం చేస్తే ఒక్కసారి విజయం వరించింది. ఒక విజయానికి స్వతంత్రులు 52 ఏళ్లపాటు నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 1978 నుంచి ఇప్పటి వరకు స్వతంత్రలు ప్రభావం చూపలేకపోయారు. ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులు బరిలో ఉంటున్నారు. కానీ గతంలో చూపిన విధంగా ప్రభావం చూపలేకపోతున్నారు. తాజా ఎన్నికల్లో బరిలో వివిధ పార్టీలకు చెందిన ఎనిమిది మంది, ఐదుగురు స్వతంత్రులు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులకు ఆయా పార్టీల నుంచి ఎనిమిది మంది, స్వతంత్రులు ఆరుగురు ఉన్నారు. 2014లో 11 మందికిగాను ప్రధాన పార్టీలకు చెందిన వారు ఆరుగురు, స్వతంత్రులు ఐదుగురు ఉన్నారు.