Telangana Congress: “ఈసారి అధికార పార్టీ అధికారంలోకి వచ్చేది అనుమానంగానే ఉంది. క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీ బలం పెంచుకుంది. గతానికంటే భిన్నంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెబుతోంది. దీనివల్ల అధికార పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. మరి మీరు పని చేస్తున్న జిల్లాలో ఎలా ఉంది? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ పథకాలు వారందరికీ అందాయా? స్థానికంగా ఉన్న గులాబీ పార్టీ నాయకులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా? అటువంటి విషయాలు మీ దృష్టికి వస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నారు?” ఇవీ ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలు.
ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి ఈసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని తపిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. రేపో, మాపో అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేయనుంది. అయితే క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలని సొంత పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.. అయితే దీనిపై ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ చర్చ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారుల మధ్య కూడా జరుగుతుండటం విశేషం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలకు అత్యంత ఇష్టమైన వ్యక్తులుగా మారిపోయారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక శాఖలు వారి వద్ద ఉండిపోయాయి. వేలకోట్ల అభివృద్ధి పనులకు డబ్బులు మొత్తం వారి చేతుల మీదుగానే కేటాయింపులకు నోచుకున్నాయి. ఈ క్రమంలో ఆ అధికారులు గులాబీ రంగును మరింత దట్టంగా ఒంటికి పూసుకోవడం ఇక్కడ విశేషం. ఈ కోవలోకి చెందిన కొంతమంది అధికారులు తమ పదవులకు రాజీనామాలు చేసి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ముఖ్యమంత్రి కెసిఆర్ నామినేటెడ్ పోస్టులు కేటాయించడంతో దర్జాగా అధికారాన్ని ఇన్ని రోజులు అనుభవించారు.
ఇక గులాబీ పార్టీకి అత్యంత అనుకూలమైన అధికారులుగా ముద్రపడ్డవారు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి మదనపడుతున్నారు. ఒకవేళ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాకుంటే తమ పరిస్థితి ఏమిటి అని వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రగతి భవన్ కు అత్యంత దగ్గరగా ఉండే అధికారులు ఒక్కసారిగా నైరాశంలో కూరుకుపోయారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో వారు ఒకింత టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. “కెసిఆర్ చరిష్మా తగ్గింది.. క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీ బలం పెంచుకుంది. ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకు చేరకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అసలు అధికార పార్టీపై ప్రజల్లో ఎందుకింత ఆగ్రహం పెరిగింది? దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పటికిప్పుడు వీటిని నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి” అనే అంశాలు అధికారుల మధ్య చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది.