TDP : తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఎన్నికల రేసులో బీఆర్‌ఎస్ ముందు వరుసలో ఉండగా, కాంగ్రెస్‌తో కలిసి వామపక్షాలు, జనసేనతో కలిసి బీజేపీ, వామపక్షాలు, టీడీపీ, చివరకు వైఎస్సార్ టీపీ కూడా సమాయత్తమవుతున్నాయి. కాంగ్రెస్ 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 55 మందితో తొలి జాబితా ప్రకటించింది. టీడీపీ 89 స్థానాల్లో పోటీ చేస్తుందని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించాడు. కానీ, అనేక తర్జనభర్జనలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖత్ తర్వాత ఎన్నికల రేసు నుంచి వైదొలుగుతున్నట్లు షాకింగ్ ప్రకటన చేశారు. అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని తెలిపినప్పటకీ చంద్రబాబు మాటకు కట్టుబడి పోటీనుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
ఎందుకు తప్పుకున్నారంటే..
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుతో టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఈ భేటీలో టీడీపీ అధినేత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో పోటీ చేయలేకపోతున్నామన్న విషయాన్ని పార్టీ నేతలకు వివరించాలని చంద్రబాబు చెప్పినట్లు కాసాని తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమైన నేతలకు వివరిస్తున్నారు. అయితే గతంలో బాలకృష్ణను తెలంగాణ ఎన్నికలను చూసుకోమని చెప్పినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు.
సినిమా బిజీలో బాలయ్య..
బాలయ్య వరుస సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్, విజయోత్సవాలలో బిజీ అయిపోయారు. లోకేష్ చంద్రబాబు బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో లీగల్ టీంతో తలమునకలయ్యారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి యాత్రలో నిమఘ్నమయ్యారు. లోకేష్ చంద్రబాబును జైల్లో నుంచి బయటకు తీసుకురావడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వారం రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో టీడీపీ అధినేత అందుబాటులో లేరు. పార్టీలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు ఇలా కీలక నేతలు లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీ ఝలక్ ఇవ్వాలని సభ..
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ తహతహలాడుతోంది. ఇందుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, టీడీపీతో కలిసి పనిచేయడానికి కమలనాథులు సుముఖంగా లేరు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల నాటికి బీజేపీ ఓ ఝలక్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. మూడు నెలల క్రితం ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో తాము బలంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా బీజేపీ తమ మద్దతు కోరుతుందని భావించారు. బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
జనసేనతో బీజేపీ..
మరోవైపు తెలంగాణలో జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. సీట్ల ఖరారు మాత్రమే మిగిలింది. టీడీపీపై మాత్రం బీజేపీ మాట్లాడడం లేదు. ఈ క్రమంలో టీడీపీ పూర్తిగా రేసు నుంచే తప్పుకుంది. ఈ క్రమంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. ఏపీలో పొత్తు కోసం, జైల్లో ఉన్న చంద్రబాబు బయటకు రావడం కోసం బీజేపీకే మద్దతు ఇస్తుందని తెలుస్తోంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన చేయకపోయినా, అంతర్గతంగా క్యాడర్‌కు సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జనసే, మరోవైపు టీడీపీ మద్దతుతో బీజేపీ పుంజుకుంటుందని అంనా వేస్తున్నారు.