TDP Rebel MLAs: ‘మా పార్టీలో చేరాలంటే ఉన్న పదవులను వదులుకొని రావాలి. భేషరతుగా పార్టీలో చేరాలి’.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీఎం జగన్ చేసిన ప్రకటనలివి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పార్టీలోకి తీసుకోవాలన్న విషయంలో జగన్ పూర్తి క్లారిటీతో ఉండేవారు. తరువాత రాజకీయ కోణంలో ఆలోచించి నిబంధనలు, షరతులను పక్కన పడేశారు. ప్రధాన విపక్షం టీడీపీతో పాటు జనసేనను రాజకీయంగా దెబ్బతీయాలని భావించడమే ఇందుకు కారణం. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఉన్న ఒక్కర్నీ తన పార్టీ వైపు తిప్పుకున్నారు. అలాగని వారు వైసీపీ కండువా కప్పుకోలేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ ఇలా జంప్ చేసిన వారికి భయం వెంటాడుతోంది. అసలు టిక్కెట్లు వస్తాయా? రావా? అన్న అనుమానంతో వారు గడుపుతున్నారు. అటు పార్టీలో చేర్పించే సమయంలో శ్రద్ధ చూపిన అగ్రనేతలు ఇప్పుడు ముఖం చాటేశారు. అటు నియోజకవర్గాల్లో పాత వైసీపీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోగా.. అవమానాలు, నిలదీతలు ఎదురవుతున్నాయి.
అవసరం లేకున్నా..
2019 ఎన్నికల్లో వైసీపీ కనివినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో 151 సీట్లతో విజయం సాధించింది. విపక్షాలకు అందనంత దూరంలో సంఖ్యాబలం సొంతం చేసుకుంది. ఆ పార్టీకి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎమ్మెల్యేలను ఆకర్షించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే జగన్ మాత్రం అలా అనుకోలేదు. అప్పటికే 23 సీట్లకే పరిమితమైన విపక్ష టీడీపీని మరింత బలహీనం చేసే క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను సొంత నియోజకవర్గాల్లో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కేసుల భయంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి ఫిరాయించారు. కండువాలు మాత్రం కప్పుకోలేదు కానీ మిగతా అన్ని విషయాల్లోనూ వారు వైసీపీ ఎమ్మెల్యేలుగానే చెలామణి అవుతూ వస్తున్నారు. అయితే ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో ఇలా గతంలో వైసీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు అప్రమత్తమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయా నియోజవర్గాల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన లేదా వైసీపీని ముందునుంచీ అంటిపెట్టుకుని ఉన్న లేదా జగన్ హామీ ఇచ్చిన నేతలు తిరిగి గళం విప్పడం మొదలుపెట్టడమే. దీంతో సదరు ఎమ్మెల్యేలకు చికాకు మొదలైంది. అదే సమయంలో వారిని తిరిగి టిక్కెట్లు ఇస్తామన్న నేతలు ముఖం చాటేయడంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది. .
పునరాలోచనలో వంశీ, బలరాం
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ యూ టర్న్.. టీడీపీ మంచి పార్టీ అని కితాబు
గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి అప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ పాత కాపులు దుట్టా రామచంద్రరావు వర్గంతో పాటు యార్లగడ్డ వెంకట్రావు వర్గంతోనూ పోరు మొదలైంది. ఈ పోరు కాస్తా ఇప్పుడు ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో మరింత ముదిరింది. దీంతో గన్నవరంలో వంశీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీఎం జగన్ ఈ రెండు వర్గాల్ని పిలిపించి సజ్జలతో మాట్లాడించినా ఎలాంటి ఫలితం రాలేదు. అలాగే ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరఫున గెలిచిన కరణం బలరాం కూడా వైసీపీలోకి వచ్చాక ఎక్కువగా కనిపించడం లేదు. అయినా ఆయన నియోజకవర్గం చీరాలలో మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ తో ఆయనకు పొసగడం లేదు. దీంతో ఆయన కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్ధితి. మధ్యలో సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమంచిని పర్చూరు పంపాలని భావించినా ఆయన మాత్రం చీరాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో కరణం వర్సెస్ ఆమంచి పోరు చీరాలలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కరణం బలరాం, వల్లభనేని వంశీ పునరాలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో తమకు ఇదే ప్రతిఘటన కొనసాగితే ఎన్నికల నాటికి తిరిగి తమ సొంత పార్టీ టీడీపీలోకి వీరిద్దరూ వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదని వారు అనుచరులు చెప్తున్నారు. మరోవైపు విశాఖ నగరంలో సైతం వాసుపల్లి గణేష్ కుమార్ కు అక్కడి పార్టీ నేతలు పొమ్మన లేక పొగ పెడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యం గణేష్ కు ఇవ్వడం లేదు. ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: Singeetam Srinivasa Rao: విషాదం: లెజెండరీ దర్శకుడి కంట కన్నీళ్లు