![]() ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను కొందరు రాజకీయ సభలకు వాడుకున్నారని విమర్శలు వస్తుండటంతో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. గడిచిన ఐదేళ్లలో టీటీడీలో వచ్చిన కానుకలు, ఖర్చులపై కాగ్ తో ఆడిట్ నిర్వహించాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.టీటీడీకి భక్తులు సమర్పించే కానుకలను ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పురాతన దేవాలయాల జీర్ణోద్ధారణ, విద్యా సంస్థలు, ఆలయాల అభివృద్ధి కోసమే వినియోగించాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా టీటీడీ నిధులను గతంలో చంద్రబాబు నాయుడి సభ కోసం కోట్ల రూపాయాల నిధులు కొందరు దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ నిధులపై కాగ్ తో ఆడిట్ నిర్వహించేలా ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిల్ దాఖలు చేశారు.గతంలోనూ టీటీడీ నిధుల దుర్వినియోగంపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర పరిధి నుంచి తప్పించి కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా మరోసారి టీడీపీ హయాంలో టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వస్తుండటంతో ఆయన తన సన్నిహితుడు సత్యపాల్ సబర్వాల్ తో ఈ పిల్లో అసోసియేట్ అయ్యారు. ఈ బాధ్యతలను విరాట్ హిందూ సమ్మేళన్ కు అప్పగించారు. ప్రధానంగా గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని వెలికితీసేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా టీడీపీని టార్గెట్ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఏదిఏమైనా భక్తులు సమర్పించే కానుకలను రాజకీయ నాయకులు తమ సభల కోసం వినియోగిస్తుండటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటికి తీసి టీడీపీ నేతలను ఒక్కొక్కరికిగా జైళ్లకు పంపుతుంది. ఇక బీజేపీ కూడా టీడీపీని టార్గెట్ చేస్తుండటంతో ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలుస్తోంది. |
|
