
2019 ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబులో పూర్తిగా నిస్సత్తువ ఆవహించిందని.. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మునుపటిల ఉత్సాహంగా పర్యటించడం లేదన్న వాదనను తెలుగు తమ్ముళ్లు తెరపైకి తెస్తున్నారు. చంద్రబాబు వయోభారం, కరోనాతో పర్యటించకున్నా.. కనీసం లోకేష్ అయినా పర్యటించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు చంద్రబాబు రాక.. లోకేష్ కనిపించక తెలుగు తమ్ముళ్లు వీరిద్దరిపై మనస్తాపం చెందారని.. వారి తీరుపై అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది.
తాజాగా ఎల్.జీ పాలిమర్స్ బాధితులను ఓదార్చడానికి చంద్రబాబు వైజాగ్ కు విమానంలో వెళ్లాలనుకున్నారు. కానీ పర్మిషన్ లేక అమరావతికి రోడ్డుమార్గాన వచ్చారు. సరే వచ్చి వారం దాటినా చంద్రబాబు అమరావతిలోని తన ఇంటిని వదలకపోవడంపై తెలుగు తమ్ముళ్లు నిరాశ చెందుతున్నారు. వైజాగ్ బాధితులను రోడ్డు మార్గాన వచ్చి చంద్రబాబు పరామర్శిస్తాడని అంతా అనుకున్నారు. కానీ వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లి అమరావతి కదలడం లేదు.
సరే.. కరోనా భయానికి బాబు భయపడి పర్యటించడం లేదని అనుకుంటే.. కనీసం అమరావతిలోని రైతులను.. ప్రజలను కలుస్తాడని అందరూ అనుకున్నారు. అమరావతి రైతులు రాజధాని మార్పుపై ఆందోళనగా ఉన్నారు. వారినైనా చంద్రబాబు కలుస్తారని అంతా అంచనావేశారు. కానీ తండ్రి కొడుకులిద్దరూ అమరావతిలోని ఇంటిని వదిలి బయటకు రాకపోవడంపై తెలుగు తమ్ముళ్లు నిరుత్సాహపడుతున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు మహానాడు ఊపులో ఉన్నారు. ఆయన జూమ్ యాప్ లో ఇంట్లోనే ఉండి తెలంగాణ, ఏపీలోని విశాఖ, సీమ, విజయవాడ నేతలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాడు. ఇంతదానికి అమరావతి రావడం ఎందుకని.. హైదరాబాద్ లోనే జూమ్ యాప్ తో సమీక్షించవచ్చు కదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు చినబాబు లోకేష్ కు కూడా ఏమైందని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన కూడా ఇల్లు విడిచి రాకపోవడంపై తాము కలత చెందామని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ అయినా అమరావతి, వైజాగ్ లో పర్యటించి బాధితులను పరామర్శిస్తే పోయేది అని అంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్ నే ప్రేమిస్తాడని.. ఏపీకి కేవలం అతిథిగా వచ్చి వెళ్లిపోతాడని టీడీపీ నేతలు అంతర్గతంగా సంభాషిస్తున్నారు..
ఇక ఎన్టీఆర్ జన్మదినం నాడు ఆయన మరణించిన ఎన్టీఆర్ ఘాట్ కానీ.. ఆయన ఫాంహౌస్ లో కానీ ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు. కానీ రాజకీయంగా ఏం కారణమో కానీ సరిగ్గా ఎన్టీఆర్ జయంతినాటికే చంద్రబాబు నివాళులర్పించకుండా ఏపీకి రావడంపై టీడీపీ శ్రేణులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయినా బాబు రాజకీయం అంతుబట్టదని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.
–నరేశ్ ఎన్నం