
ఆఫ్ఘనిస్తాన్ వార్తల్లో.. గత వారం రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పంజ్ షీర్. తాలిబన్లను అడ్డుకునే దమ్ము పంజ్ ‘షేర్’కే ఉందని, ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అంతర్జాతీయంగా వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం పంజ్ షీర్ కూడా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లబోతోందని తెలుస్తోంది. లొంగిపోయేందుకు ఆ ప్రాంత అధినేత మసూద్ ప్రయత్నాలు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణమేంటీ? అన్నది చూద్దాం.
ఆఫ్ఘనిస్తాన్ లో పంజ్ షీర్ చరిత్ర అసాధారణమైనది. ఆఫ్ఘన్ ను ఆక్రమించేందుకు నాడు ప్రయత్నించిన సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రాంతమది. ఇందుకోసం నార్దర్ అలయన్స్ అనే సంస్థను 1979లో స్థాపించాడు అహ్మెద్ షా మసూద్. పంజషీర్ ప్రావిన్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగించాడు. అతని పోరాటం ఏ స్థాయిలో కొనసాగిందంటే.. ఆఫ్ఘన్ మొత్తాన్ని సోవియట్ సైన్యం అదుపులోకి తీసుకున్నప్పటికీ.. పంజషీర్ లో మాత్రం అడుగు పెట్టలేకపోయింది.
ఇక, తాలిబన్ల విషయంలోనూ సీన్ రిపీట్ అయ్యింది. 1996లో ఆఫ్ఘన్ ను ఆక్రమించిన తాలిబన్లు.. 2001 వరకు పాలన సాగించారు. ఈ సమయంలో ఆఫ్ఘన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. పంజషీర్ ను మాత్రం టచ్ చేయలేకపోయారు. ఇదీ.. అహ్మెద్ షా మసూద్ కెపాసిటీ. అలాంటి మసూద్ ను ఆల్ ఖైదా హత్య చేసింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమాన దాడి చేయడానికి రెండు రోజుల ముందు మసూద్ ను చంపేశారు. తండ్రి మరణం తర్వాత పంజషీర్ ప్రావిన్సు బాధ్యతలు తీసుకున్నాడు ఆయన కుమారుడు అహ్మెద్ మసూద్. ఇప్పుడు ఇతనే.. తాలిబన్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు.
అయితే.. తమ వద్ద కేవలం 6 వేల సైన్యం మాత్రమే ఉన్నట్టు ప్రకటించాడు మసూద్. తాలిబన్లపై పోరాటం చేసేందుకు అంతర్జాతీయ సహకారం కావాలని కోరాడు. అమెరికా, ఫ్రాన్స్, అరబ్ దేశాలతోపాటు యూరప్ దేశాలను అభ్యర్థించాడు. కానీ.. ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో శరణం అనివార్యమని మసూద్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన సలహాదారుడు ఒకరు మీడియా ముఖంగా ప్రకటించడం గమనార్హం. దాదాపు 80 వేల వరకు ఉన్న తాలిబన్ సైన్యాన్ని.. కేవలం 6 వేల సైన్యం ఉన్న పంజ్ షీర్ ఎదుర్కోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. అప్పట్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, ఇప్పుడు తాలిబన్లు యుద్ధంలో ఆరితేరి ఉన్నారని సదరు సలహాదారు చెప్పారు.
కాగా.. ఈ సారి ఎలాగైనా పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న తాలిబన్లు.. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టేశారు. ఏ క్షణమైనా దాడులతో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి చైనా, పాకిస్తాన్ కూడా సహకరిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో… లొంగిపోవడం తప్ప, మరో మార్గం కనిపించట్లేదని అంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మసూద్.. తాలిబన్లతో చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గౌరవపూర్వకంగానే పంజ్ షీర్ ను అప్పగించేందుకు చూస్తున్నట్టు సమాచారం. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.