AP BJP: భారతీయ జనతా పార్టీ పై ఏపీలో ఏదో ఒకటి జరగబోతోంది. అన్ని పార్టీలకు బిజెపి స్నేహంగా ఉన్నా.. లోలోపల మాత్రం ఆ పార్టీ తీరుపై అన్ని రాజకీయ పక్షాల్లో ఆగ్రహం ఉంది. అటు అధికార వైసిపితో తెరచాటు స్నేహం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సైతం బిజెపితో జతకట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే జనసేన మిత్రపక్షంగా ఉంది. ఇలా ఎలా చూసుకున్నా బిజెపి అన్ని రాజకీయ పక్షాలతో స్నేహంగా ఉన్నట్టే తేలుతోంది. అయితే ఏ ఒక్క పక్షానికి బాహటంగా మద్దతు తెలపకపోవడం విశేషం. అసలు బిజెపి అంతరంగం ఏమిటి అని అంతుపట్టడం లేదు. వైసిపికి తెరవెనుక స్నేహం కొనసాగిస్తుందా? లేకుంటే జనసేన, టిడిపి కూటమిలో చేరుతుందా? అన్నది మాత్రం తెలియడం లేదు.
జాతీయస్థాయిలో బిజెపి బలీయమైన శక్తిగా ఉంది. దానిని అనుసరించే ఏపీలో సైతం ఆ పార్టీ ఉనికి చాటుకుంటుంది. ఓట్లు, సీట్లు లేకపోయినా రాజకీయంగా మాత్రం బిజెపి మంచి స్థానంలోనే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పాత్ర ఏమిటి అన్నది తెలియడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఎన్నికల మేనేజ్మెంట్లో సహకరిస్తారని.. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారన్న ఒకే ఒక్క కారణంతో బిజెపి స్నేహాన్ని అన్ని రాజకీయ పక్షాలు కోరుకుంటున్నాయి.
కేంద్రంలో మరోసారి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం రావడం ఖాయం అని తేలుతోంది. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పార్టీకి సర్వేలో స్నానం కూడా దక్కడం లేదు. ఆ పార్టీ కూటమితో కలిసి వెళుతుందా? లేకుంటే ఒంటరిగా పోటీ చేస్తుందా? అన్నది తెలియకపోవడంతో సర్వే సంస్థలు బిజెపికి ఓటు శాతాన్ని కట్టబెడుతున్నాయి. అయితే అది ఒకటి కంటే తక్కువ శాతాన్ని చూపిస్తుండడం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మింగుడు పడని విషయం.
అయితే బిజెపి.. టిడిపి, జనసేన కూటమిలోకి చేరితే లాభం కంటే నష్టమే అధికమని ఓ సర్వే చెబుతుండడం విశేషం. ప్రముఖ సర్వే సంస్థ” ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీమ్” చేసిన కాజా సర్వే ప్రకారం.. భారతీయ జనతా పార్టీ ఏపీలో దయనీయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 86 అసెంబ్లీ సీట్లు తెచ్చుకుంటుందని ఈ సర్వేలో తేలింది. అదే జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తే 108 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తేల్చింది. అదే టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తే ఈ కూటమి 75 స్థానాలకే పరిమితమైపోతుందని.. వైసిపి 100 స్థానాలతో అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే తేల్చడం విశేషం. మరోవైపు టిడిపి, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే కూటమికి 115 స్థానాలు దక్కనున్నాయని ఫలితాలు వెల్లడించడం విశేషం.
అయితే బిజెపి తమ వైపు వస్తుందని చంద్రబాబుతో పాటు పవన్ ఆశించారు. అటు ఏపీ బీజేపీ నేతలు సైతం ఈ కూటమి వైపు వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారు. మరోవైపు బిజెపి పెద్దలనుంచి ఎటువంటి సంకేతాలు రావడం లేదు. అదే సమయంలో బిజెపి లేకుంటే తాముకూటమిలో చేరుతామని వామపక్షాల నాయకులు ప్రతిపాదిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపి కానీ కూటమితో వస్తే వైసిపి విజయం సునాయాసం అవుతుందని సర్వేలు చెబుతుండడం చర్చినియాంశంగా మారింది. ఇప్పటివరకు బిజెపి కోసం ఎదురుచూసిన తెలుగుదేశం, జనసేనలు తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది.అయితే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.