Pegasus Case: ఈమధ్య ప్రధానమంత్రి మోడీకి తలపోట్లు ఎక్కువైపోయాయి. బిజెపి కి చెందిన నుపూర్ శర్మ వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. పెగాసస్ పై కూడా అదే స్థాయిలో మండిపడింది. అసలు స్పైవేర్ను తీసుకురావలసిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించింది. ఇక ఇటీవల వరుసగా సుప్రీంకోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు పడుతున్నాయి. పలు విషయాల్లో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు నేరుగా ఎండ గడుతోంది. పెగాసస్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ద్వారా మళ్లీ భారీ షాక్ తగిలింది. దేశంలోని ప్రతిపక్షాలు, ఇతర సంస్థలపై కేంద్రం నిఘా పెడుతోందని, ఇందుకు ఇజ్రాయిల్ దేశం నుంచి పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పలుమార్లు పార్లమెంట్ లో రగడ జరిగింది. ప్రతిపక్షాలు బెట్టు వీడకపోవడం, పైగా కేసు దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ నివేదికను అత్యున్నత న్యాయస్థానం గురువారం పరిశీలించింది. దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఈ నివేదిక పేర్కొందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్లు తమకు సమర్పించిన మొబైల్ ఫోన్లలో పెగాసస్ స్పై వేర్ ఉన్నట్టు నిర్ధారణ కాలేదని పేర్కొన్నది.

2021 లో కమిటీ ఏర్పాటు
ఇజ్రాయెల్ కి చెందిన ఓ సంస్థ పెగాసస్ అనే స్పై వేర్ ను రూపొందించింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అంతరంగిక సంభాషణలన్నింటినీ ప్రత్యర్ధులకు చేరవేరుస్తుంది. ఈ స్పైవేర్ ను చాలా దేశాలు ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేశాయి. అయితే దీన్ని కూడా భారత్ కొనుగోలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మోడీ ప్రధానమంత్రి అయ్యాక తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ నాయకులు, ఉద్యమకారులపై నిఘా పెడుతున్నారని ఆరోపిస్తూ, దీనిపై స్వతంత్ర కమిటీ చేత దర్యాప్తు నిర్వహించాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2021 అక్టోబర్లో అత్యున్నత న్యాయస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్.వి రవీంద్ర న్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక మూడు భాగాల్లో ఉందని రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది.

ఈ కమిటీ దర్యాప్తునకు కేంద్రం సహకరించడం లేదని మౌఖికంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తులో భాగంగా కమిటీకి 29 ఫోన్లను సమర్పించారని, వాటిల్లో ఐదింటిలో మాల్ వేర్ ఉన్నట్టు గుర్తించిందని తెలిపింది. అయితే ఆ మాల్ వేర్ పెగాససా? ఇంకోటా? అనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు కమిటీకి ఫోన్లను సమర్పించినవారు నివేదికను బహిరంగంగా వెల్లడించవద్దని కోరినట్లు సమాచారం. ఈ నివేదిక లోని భాగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంపై పరిశీలిస్తామని తెలిపింది. ఈ నివేదికలో వ్యక్తిగత సమాచారం ఉండవచ్చునని, రహస్యంగా ఉంచాలని కమిటీ చెప్పినట్లు తెలిపింది. ఈ నివేదికలో రెండు భాగాలను టెక్నికల్ కమిటీ ఇచ్చింది. ఒక భాగాన్ని జస్టిస్ రవీంద్ర న్ ఇచ్చారు. జస్టిస్ రవీంద్రన్ ఇచ్చిన భాగాన్ని తన వెబ్సైట్లో ప్రచురిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మొదటి, రెండు భాగాల నకలును తమకు ఇవ్వాలని పిటీషనర్లు కోరగా, ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఎన్వి రమణ చెప్పారు. నివేదికను పూర్తిగా పరిశీలించకుండా ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేశారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.