
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయనను కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తెలపాలని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే తన తండ్రి రఘురామపై సీఐడీ అధికారులు హత్యాయత్నం చేశారని ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. రఘురామకు వై కేటగిరీ భద్రత కొనసాగించాలని, ఉత్తర్వులు వచ్చే వరకు ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంచాలని సుప్రీంకోర్టు సూచించింది.
కౌంటర్ దాఖలు చేయాలని..
రఘురామ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వాదిస్తున్న లాయర్ ముకుల్ రోహత్గీ రఘురామ కేసును వాదించారు. ప్రభుత్వం తరఫున దువ్యంత్ రనే అనే సీనియర్ లాయర్ వాదనలు వినిపించారు.
సుప్రీం ఆదేశాలను..
హైకోర్టు ఆదేశాలను పాటించడానికి సీఐడీ ముందుకు రాలేదు. వైద్య పరీక్షల కోసం రమేష్ ఆస్పత్రికి తరలించాలని నిన్న రాత్రి 8 గంటల సమయంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యతను సీఎస్ కు అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రోజుకో మలుపు
రఘురామ కృష్ణం రాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వంపై పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన రఘురామ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో ఆయన కుమారుడు కేసు వేయడంతో రఘురామను కొట్టారో లేదో తేల్చాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో ఈ కేసు ఎటు వైపు వెళ్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు జగన్ సర్కారు సైతం చిక్కుల్లో పడే అవకాశాలు లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రఘురామ శరీరంపై గాయాలున్నాయని ఆయన కొడుకు భరత్ ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు సైతం ఈ కేసులో దోషులయ్యే అవకాశం లేకపోలేదు.