IAS Sri Lakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మి( IAS Sri Lakshmi ).. రెండు దశాబ్దాలుగా ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. ఓబులాపురం మైనింగ్ కేసుతో పాటు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆమె నిందితురాలు. ఈ కేసు నుంచి తనను తప్పించాలని ఆమె పలుమార్లు వివిధ కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆమెకు అత్యున్నత న్యాయస్థానంలో షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఆమె తప్పించుకోలేని పరిస్థితి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె నిబంధనలకు విరుద్ధంగా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ కంపెనీకి గనులు లీజుకు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఆమె గతంలో అరెస్టయ్యారు. కొంతకాలం జైల్లో ఉండి బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె ఉన్నత న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమె పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆమె పాత్ర పై సిబిఐ విచారణ జరపనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో నిందితులకు శిక్ష పడడంతో శ్రీలక్ష్మికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందన్న టాక్ వినిపిస్తోంది.
* అధికార దుర్వినియోగం..
శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ అధికారిణి. 2006లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆమె ఈ పదవిలో ఉన్నప్పుడు ఓఎంసీ మైనింగ్ వ్యవహారం ముందుకు సాగింది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి ఓఎంసీ లీజులు కట్టబెట్టేందుకు ఆమె అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఆమె ఆరో నిందితురాలు. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సిపిఐ స్పష్టమైన ఆధారాలను చూపింది. ప్రధానంగా క్యాపిటల్ మైన్స్ అనే పదాన్ని చేర్చి భారీగా దుర్వినియోగం చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిని ఆసరాగా చేసుకుని గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ ఇష్టారాజ్యంగా మైనింగ్ తవ్వకాలు చేసి.. విదేశాలకు ఖనిజాన్ని విక్రయించింది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీలక్ష్మి పాత్ర కీలకం అని సిబిఐ గట్టి వాదనలే వినిపించింది. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం పోయినట్లు స్పష్టం చేసింది. భారతదేశ ఖనిజ వనరుల పరిరక్షణ, ప్రభుత్వ ఆదాయాలు, పారదర్శక పాలన, అసలైన లీజు దారుల హక్కులు అన్ని వాటిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని సిపిఐ వాదించింది. 350 కోట్లనుంచి 500 కోట్ల వరకు నష్టం జరిగిందన్నది సిబిఐ వాదన. 2011లో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు సమయంలో ఓఎంసీ అక్రమ మైనింగ్ వీలుగా అక్షరాల 5000 కోట్లు ఉంటుందన్నది తన నివేదికల్లో తేల్చింది.
* 21 సంవత్సరాలకే సివిల్స్ టాపర్…
తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ శ్రీలక్ష్మి పేరు తెలియని వారు ఉండరు. 21 సంవత్సరాలకు సివిల్స్ టాపర్ ఆమె. కానీ 45 సంవత్సరాలకే ఆమె జైలు జీవితం అనుభవించడం మాత్రం నిజంగా షాకింగ్ పరిణామం. ఒక మహిళ ఐఏఎస్ అధికారిణి అక్రమాస్తుల కేసుల్లో జైలు పాలు అవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి. అయితే అప్పట్లో నడవలేని స్థితిలో కోర్టు మెట్లు ఎక్కి బెయిల్ తెచ్చుకున్నారు ఆమె. 2014లో రాష్ట్ర విభజనతో ఆమె తెలంగాణ క్యాడర్ను ఎంచుకున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన సిఫారసులు మేరకు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు శ్రీలక్ష్మి. అప్పట్లో ఆమెకు స్పెషల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.
* బ్యూరోక్రాట్ల వ్యవస్థకు గుణపాఠం..
ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె చిక్కుకోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నది బహిరంగ ఆరోపణ. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పై విషయం చిమ్మేందుకు శ్రీలక్ష్మిని వాడుకున్నారన్న ఆరోపణ కూడా ఉంది. అమరావతిలో ఇతరులకు ఇండ్ల స్థలాలు, విశాఖలో పెట్టుబడుల సదస్సు సమయంలో శ్రీ లక్ష్మీపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అభినందించేందుకు వెళ్లిన ఆమె నుంచి.. పుష్పగుచ్చం తీసుకునేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. అక్కడికి కొద్ది కాలానికి ఆమె ఎటువంటి పోస్టింగ్ లేకుండా పోయింది ఆమెకు. 21 సంవత్సరాలకు సివిల్స్ లో టాపర్గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. అంతలా రాజ్యాంగాన్ని అవపోషణ పట్టారు ఆమె. కానీ అవినీతి కేసుల్లో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే ఒక్కటి మాత్రం నిజం శ్రీలక్ష్మి ఉదంతం బ్యూరోక్రాట్ల వ్యవస్థకు ఒక గుణపాఠం.