Stock Market
Stock Market : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలలో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్లు నష్టపోయి 77,257 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 104 పాయింట్లు పడిపోయి 23,404 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రధానంగా ఐటీసీ హోటల్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో ఉంటే, టాటా, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 15 నష్టపోయాయి.. 15 లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 27 నష్టపోయాయి. 23 లాభాల్లో ఉన్నాయి. NSE సెక్టోరల్ ఇండెక్స్‌లోని ఐటీ రంగం అత్యధికంగా 1.02శాతం పడిపోయింది. బడ్జెట్ కు ఒక రోజు ముందు విదేశీ పెట్టుబడిదారులు ₹1,188.99 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
బడ్జెట్ ప్రకటనల ప్రభావం.. మార్కెట్ దిశ ఏంటి?
విపణి నిపుణుల అంచనా ప్రకారం, బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధానాలు ఉంటే మార్కెట్ పాజిటివ్‌గా స్పందించే అవకాశముంది. అయితే, భూమి, కార్మిక రంగాల్లో సంస్కరణలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 8శాతం వృద్ధి రేటు అవసరమని నివేదిక పేర్కొంది.
గత బడ్జెట్‌లకు మార్కెట్ స్పందన ఎలా ఉంది?
గత 5 బడ్జెట్‌ల పరిశీలన చూస్తే,
* 2021 బడ్జెట్ రోజున మార్కెట్ 2.1% పెరిగింది.
* 2020 బడ్జెట్ రోజు 2.4% క్షీణతను నమోదు చేసింది.
* 2024 బడ్జెట్‌లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మార్పుల కారణంగా సెన్సెక్స్ 1,200 పాయింట్లు పడిపోయింది.
బడ్జెట్ రోజు స్టాక్ ఎక్స్చేంజ్ పని చేస్తుందా?
ఇటీవల 12 ఏళ్లలో ఇది మూడోసారి శనివారం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే, బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి 1న తెరిచే ఉంటాయి.
ఈసారి మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం?
నిపుణుల అంచనా ప్రకారం, వ్యవసాయం, పవర్, ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు ప్రోత్సాహం లభించింది. దీంతో ఆ రంగాల స్టాక్స్ లాభపడతాయి. కానీ, ప్రభుత్వం ప్రజాప్రియ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టి, పెట్టుబడిదారుల నమ్మకాన్ని తగ్గిస్తే మార్కెట్ నెగటివ్ ప్రతిస్పందించే అవకాశం ఉంది.