Shri Atmasakshi Survey : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని విశ్లేషణలు బయటపడుతున్నాయి.
ఇక బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌కు ఆధిక్యత ఉందని అనేక సర్వే ఏజెన్సీలు ఇప్పటికే అంచనా వేసాయి. కొద్దిమంది మాత్రమే బీఆర్‌ఎస్ సౌకర్యవంతమైన మెజారిటీతో హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పారు. వీరిలో ఒకరిద్దరు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో హంగ్ అసెంబ్లీ కూడా వస్తుందని జోస్యం చెప్పారు.
గతంలో కచ్చితమైన సర్వేలు చేశామని చెప్పిన శ్రీ ఆత్మ సాక్షి (ఎస్‌ఎఎస్) గ్రూపు తాజాగా నిర్వహించిన సర్వేలో బిఆర్‌ఎస్ తన సీట్లను తగ్గించి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలుస్తుందని అంచనా వేసింది.
ఈ సర్వే ప్రకారం, బీఆర్ఎస్ కనిష్టంగా 64 సీట్లు పొంది స్వల్ప సీట్లతోనే అధికారంలోకి వస్తుందని శ్రీఆత్మసాక్షి సర్వే అంచనావేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. కొంచెం బీఆర్ఎస్ కష్టపడితే గరిష్టంగా 70 సీట్లు సాధించవచ్చని తెలిపింది. కనీసం ఆరు సీట్లలో తీవ్రమైన పోటీ ఉంటుందని వివరించింది.
ఇక కాంగ్రెస్ కు కనిష్టంగా 37 సీట్లు, గరిష్ఠంగా 43 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 5-6 సీట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం తన ఆరు లేదా ఏడు స్థానాలను నిలుపుకుంటుందని పేర్కొంది.
అయితే ఇతరులు (బీఎస్పీ మరియు వైఎస్ఆర్ టీపీ లేదా స్వతంత్రులు) 1-2 సీట్లు పొందవచ్చని సర్వే తెలిపింది.
బీఆర్‌ఎస్ 42.5 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌కు 36.5 శాతం, బీజేపీకి 10.75 శాతం ఓట్లు రావచ్చని ఎస్‌ఏఎస్ సర్వే పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను అక్టోబర్ 28న విడుదల చేసినప్పుడు సంస్థ పంచుకున్న గ్రౌండ్ పరిస్థితి ఇది. హోరాహోరీగా పోటీ జరిగే కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ రెండు, బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
సైలెంట్ వోట్ ఫ్యాక్టర్ రాష్ట్రంలో 1.75 శాతంగా ఉన్నట్టు తెలిపింది. సాధారణంగా, సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ లో 80 శాతం మంది ఎన్నికలకు ముందు ప్రజలలో విశ్వాసం పొంది ఓటు వేస్తారు. ఊపందుకుంటున్న రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తారని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ నివేదికలో పేర్కొంది. అదే గెలుపు ఓటములను శాసిస్తుందని తెలిపింది. దీంతో కాంగ్రెస్ కు కూడా ఇందులో ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పింది.
వివిధ కాల వ్యవధులలో ఈ సంస్థ ఇప్పటివరకు మూడు సర్వేలను నిర్వహించింది. మొదటి సర్వే జూలై 18 నుండి ఆగస్టు 17 వరకు నిర్వహించబడింది, ఆ తర్వాత రెండవ సర్వే ఆగస్టు 21 మరియు అక్టోబర్ 30 మధ్య జరిగింది. మూడవ సర్వే అక్టోబర్ 2 నుండి 28 వరకు నిర్వహించబడింది.
2018 ఎన్నికలకు ముందు, శ్రీఆత్మసాక్షి గ్రూప్ బీఆర్ఎస్ గెలుస్తుందని ఖచ్చితంగా అంచనా వేసింది. టీఆర్‌ఎస్ కు 85 నుంచి 89 సీట్లు గెలుస్తుందని తెలిపింది. అన్నట్టుగానే ఆ పార్టీ 88 సీట్లు గెలుచుకుంది. అలాగే, కాంగ్రెస్‌కు 19 నుంచి 20 సీట్లు వస్తాయని, ఆ పార్టీ 19 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. బీజేపీ ఒక్క సీటు గెలుస్తుందని అంచనా వేయగా ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.
అత్యంత ఖచ్చితత్వంతో సీట్లు అంచనావేసి శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు కూడా ఆ అంచనా నిజం చేస్తుందా? బీఆర్ఎస్ గెలుస్తుందా? కాంగ్రెస్ ఏమైనా హైజాక్ చేస్తుందా? అన్నది వేచిచూడాలి.