కార్మికుల సమస్యల మీద పోరాడి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన యూనియన్ లీడర్లు.. వారికే వాళ్లే కొట్టుకుంటున్నారు. పదవి కోసం పొట్లాడుకుంటున్నారు. రెండు వర్గాలుగా వీడిపోయి బలాలను చాటుతున్నారు. ఏకంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ సంఘమైన టీఎంయూలోనే ఈ దుస్థితి దాపురించింది. యూనియన్‌లో నాయకత్వ మార్పుపై అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. జనరల్ సెక్రటరీ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ గతేడాది డిసెంబర్‌లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దాంతో అటు ప్రజలు ఇబ్బందులు పడడమే కాకుండా.. ఇటు ప్రభుత్వం కూడా లాస్ అయింది. ప్రజల నుంచి విమర్శలు సైతం ఎదుర్కొంది. అయితే.. వీటన్నింటికి కారణం యూనియన్లే అని సీఎం కేసీఆర్ ఆ టైంలో ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు ఆర్టీసీలో యూనియన్లే అవసరం లేదని జబర్దస్త్‌గా ప్రకటించేశారు. ఇందులో భాగంగా యూనియన్లకు ఇచ్చిన అన్ని సదుపాయాలను రద్దు చేశారు. అప్పటి నుంచి గుర్తింపు సంఘమైన టీఎంయూ స్తబ్దుగానే ఉంది. ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు నాయకత్వం మార్పు తప్పదని భావించింది. కానీ.. ఇక్కడే అసలు ముసలం మొదలైంది యూనియన్‌లో.
నాయకత్వ మార్పుపై ఇప్పటికే యూనియన్ కీలక నేతలు ఒకటి, రెండు సార్లు సమావేశమయ్యారు. అయితే యూనియన్‌లో జనరల్ సెక్రటరీ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న ఓ సీనియన్ నేత తనకే జనరల్ సెక్రటరీ కావాలనే పంతంలో ఉన్నారు. ఉద్యమ సమయం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నానని, తనకే ఇవ్వాలంటూ భీష్మించుకుకూర్చున్నారు. మొదట ఇస్తామని అంగీకరించిన యూనియన్ పెద్దలు ఆ తర్వాత వివిధ పరిణామాలతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. దీంతో సదరు నేతలో అసహనం పెరిగింది. ఆయన అనుచరులతో కలిసి మరో వర్గంగా చీలారు.
ఇటీవల రహస్యంగా జరిగిన సమావేశంలో తమ వర్గానికి అనుకూలంగా ఉన్న కొంత మంది హాజరై వివిధ అంశాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకే ప్రధాన కార్యదర్శి పదవి కావాలని మద్దతు కోరే ప్రయత్నం చేశారు. ఒక వేళ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వకపోతే యూనియన్ సభ్యత్వానికి రాజీనామా చేసి, కొత్తగా మరో యూనియన్ పెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రుల సాయంతో కేసీఆర్, కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ప్రభుత్వ మద్దతుతోనే సాధ్యమని ఆ వర్గం భావిస్తోంది. కాగా ఈ విషయంపై 10వ తేదీ వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇప్పట్లో నాయకత్వ మార్పు అంటూ లేదని మరో వర్గం చెప్పుకొస్తోంది. ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా సదరు నేత అంగీకరించలేదని పేర్కొంటోంది. కావాలని రహస్య సమావేశాలు పెడుతున్నా ఆశించిన మేర నేతలు హాజరు కాలేదని అంటోంది. ఇలానే యూనియన్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే బహిష్కరిస్తామని ఆ వర్గం నేతలు చెబుతున్నారు.