ఆలయాలపై వరుస దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఉపేక్షించడంలో అర్థం ఏమిటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. ఇదే వైఖరి కొనసాగితే ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దాలని, వైకాపా ప్రభుత్వ హిందూ వ్యతిరేక ధోరణిని నిరసిస్తూ, దేవాలయాల సందర్శన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా కృష్ణాతీరంలోని శ్రీశైవక్షేత్రంలోని కోటిలింగేశ్వరస్వామికి పూజాభిషేకాలు నిర్వహించుకొని, అనంతరం, గురుపౌర్ణమి సందర్భంగా, క్షేత్ర పీఠాధిపతి శ్రీశివ స్వాముల వారిని సన్మానించారు. అనంతరం ఇంద్రకీలాద్రి మీద ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్లను దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత కృష్ణానదీ తీరంలో తొలగించిన ఆయాలు, సీతమ్మవారి పాదాల ప్రాంతాన్ని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి క్రైస్తవమతాన్ని అన్నివిధాల ప్రోత్సహిస్తూ, హిందూ మతాన్ని పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధనంతో చర్చిలు నిర్మిస్తూ, ఫాస్టర్లకు, ముల్లాలకు జీతాలిస్తున్నారన్నారు. మరోవైపు అచారకశక్తులు ఉ ద్దేశపూర్వకంగా హిందూ ఆలయాలు కూల్చివేత, విగ్రహాల ధ్వంసం, రధాలను దగ్ధంచేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే, ప్రభుత్వం అదుపుచేయకపోవడంతో హిందువులు తీవ్రంగా ఆక్రోశిస్తురని ఆవేదనచెందారు. ఈ సంఘటనలు జరిగి ఏడాది గడచినా రాష్ట్ర ప్రభుత్వం దోషులను ఇంతవరకూ పట్టుకోక చెవుల్లో పూలు పెడుతోందన్నారు. దీనిని హిందువులను అవమానపరచడంగా భావిస్తున్నామన్నారు.
– 40 గుడులు నిర్మించాలి
40 గుడులు కూల్చివేస్తే నాలుగు గుడులు కడుతున్నారని, 1,400 గజాల్లో ఉన్న గుడికి వంద గజాల్లో కడుతూ కంటితుడుపు చర్యలు చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. కూల్చివేసిన 40 గుడులు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆర్ధిక పరిస్థితి సజావుగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక కుటుంబంగా భావిస్తూ, కుటుంబ ఆర్థికపరిస్థితి ఏ మాత్రం సజావుగా లేదని సోమువీర్రాజు అన్నారు. జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీపిఎఫ్ ను, సిపిఎస్ ను రద్దు చేస్తామని, తాత్కాలిక కార్మికులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలు నీటిమూడలేనా అని ప్రశ్నించారు. రెండేళ్లలో సచివాలయం ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి గ్రూప్ -1 కన్నా కష్టమైన పరీక్ష పాసవ్వాలని నిబంధన విధించి వారికి చుక్కలు చూపిస్తున్నారని ఆక్షేపించారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇచ్చే పెన్షన్లు, గ్రాట్యుటీ, బీమా వంటి ఆర్జితాలు రూ.3 వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. సచివాలయాలకు ముఖ్యమంత్రి, అధికారులు వెళ్లడం లేదని, ఏడాది నుంచి ఒక్క ఫైల్ క్లియర్ కాలేదని విమర్శించారు.
– కొన్ని కార్యక్రమాలకే పరిమితమా?
వైకాపా ప్రభుత్వం కొన్ని నిర్దేశిత కార్యక్రమాల కోసం తప్ప మిగతావి వదలివేసి జబ్బలు చరుచుకుంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తల్లకిందులైందని, 1, 2 ఏళ్లలో జీతాలు కూడా ఇవ్వలేరనేది సందేహం కలిగిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఇంకా 20 శాతం మందికి జీతాలు ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే శక్తిని ముఖ్యమంత్రికి ప్రసాదించాలని స్వామివారు, అమ్మవార్లను కోరుకున్నట్లు చెప్పారు. కరోనా వల్ల ప్రజలకు ఏర్పడిన అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దాలని ప్రార్ధించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, ప్రధాన కార్యదర్శులు పివిఎన్ మాధవ్, ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరాం, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి డా॥ దాసం ఉమామహేశ్వరరాజు, గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
– కోటప్పకొండలో
కోటప్పకొండలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీసోమువీర్రాజుకు ఘనస్వాగతం లభించింది. నర్సరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సైదారావు, రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ యాదవ్, నవకుమార్ తో కూడిన నాయకులు, కార్యకర్తల బృందం కోటప్పకొండకు చేరిన పార్టీ రాష్ట్ర నాయకులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలసి కోటప్పకొండకు చేరుకున్నారు.
శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో శ్రీసోమువీర్రాజు, ఇతర నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సోమువీర్రాజు మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం హిందువులు మనోభావాలు దెబ్బతీస్తోందన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు, ఈ ముఖ్యమంత్రి హిందూ వ్యతిరేక ఎజెండాను అనుసరిస్తున్నట్లు ఎవరికైనా అర్ధమైపోతుందన్నారు. చర్చిల అభివృద్దే ముఖ్యమంత్రి ధ్యేయమని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్న రెండుపార్టీల కుటుంబ పాలన నుంచి విముక్తి చేయాలని అన్నారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలతో రాష్ట్రం ఆర్థిక తిరోగమనంలో ఉందన్నారు. సంవత్సర కాలంగా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, జీతాలు ఇవ్వలేని విధంగా ప్రభుత్వం అప్పులు చేయడం ముఖ్యమంత్రి అలవాటు గామారిందని ఆరోపించారు. సచివాలయం ఉద్యోగులను పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందన్నారు. రెండేళ్లుగా పీఆర్సీ ప్రకటన లేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీ దేవాలయ సందర్శన చేస్తూ ప్రజల ను అప్రమత్తం చేస్తోందని, ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడతామని హెచ్చరించారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Somu veeraraj questioned the government during a visit to temples
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com