Social Media Misuse: సోషల్ మీడియా లేకుండా బతికే పరిస్థితి లేదు. కనీసం సోషల్ మీడియా చూడకుండా పది నిమిషాలు ఉండే అవకాశం లేదు. మనిషి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయింది. పోస్టులు పెట్టడం.. కామెంట్లు చేయడం.. కామెంట్లకు స్పందించడం.. ఒకప్పుడు సోషల్ మీడియాను ఇలానే వాడేవారు. ఇప్పుడు దూషించడానికి.. ఆరోపించడానికి.. విమర్శించడానికి ఉపయోగిస్తున్నారు.
సోషల్ మీడియా చూస్తుంటే కొన్ని సందర్భాలలో పట్టరాని కోపం వస్తుంది. ఆపుకోలేని ఆవేశం కలుగుతుంది. ఆ సమయంలో మన స్పందనను గట్టిగానే తెలియజేస్తాం. అప్పుడు కొంచెం కఠినమైన పదాలను వాడుతూ ఉంటాం. ఒకప్పుడు ఇవి చెల్లుబాటు అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇష్టానుసారంగా మాట్లాడితే.. నోరు ఉంది కదా అని జారితే దూల తీరిపోతుంది. ఇదే విషయాన్ని న్యాయపుణులు హెచ్చరిస్తున్నారు. దారుణంగా మాట్లాడటం.. అవమానకరంగా వ్యవహరించడం.. బెదిరింపు పదజాలాన్ని ఉపయోగించడం వంటి వాటి వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది
కోపంలో ఉన్నప్పుడు వాడే పదాలు.. కటకటాల వెనక్కి పంపిస్తాయి. ఆ సెక్షన్లు కూడా అత్యంత పదునుగా ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యల వల్ల సామాజిక సామరస్యం దెబ్బతింటుంది. విద్వేషాలు రగిలే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తుల మీద కేసులు నమోదవు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అదే కాదు ఒకరిని ఉద్దేశించి అశ్లీలమైన పదాలు ఉపయోగించడం.. అవమానకరంగా మాట్లాడటం.. అసభ్యకరంగా వ్యవహరించడం వంటివి చేస్తే జైలు శిక్ష లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ గొడవలకు దారి తీసే విధంగా దూషణకు దిగితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. భావ ప్రకటనను స్వేచ్ఛాయుతంగా వాడుకోవాలి. అలాకాకుండా ఇతరుల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉపయోగిస్తే.. ఆ తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అగత్యం కూడా ఏర్పడుతుంది. అందువల్లే నోరు అదుపులో పెట్టుకోవాలి. సోషల్ మీడియాను జస్ట్ చూసి చూడనట్టు వదిలేయాలి.
