వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ అధినేత జగన్ పై పగబట్టాడు. తాజాగా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు ఎక్కారు. దాదాపు 11 సీబీఐ చార్జిషీట్లలో ఏ1గా జగన్ ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటీషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. జగన్ కేసుల్లో ఆలస్యం జరుగుతోందని.. ఆయన త్వరగా కేసుల నుంచి బయటపడాలనే ఈ పిటీషన్ వేసినట్టు రఘురామకృష్ణం రాజు మొసలి కన్నీరు కార్చాడు. సీఎం జగన్ దిగిపోయి వేరొకరికి సీఎం సీటును కట్టబెట్టాలని.. క్లీన్ గా బయటకు రావాలని రఘురామ అన్నారు.
సీబీఐ ప్రత్యేక కోర్టులో నరసాపురం ఎంపీ కె రఘు రామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటీషన్ తొలుత ఎలా అర్హమైనదో వివరించారు. ఒక కేసులో బెయిల్‌ను రద్దు చేయాలని కోరే హక్కు తనకు ఉందా లేదా అని వివరించారు.
సాధారణంగా ఒక కేసులో కోర్టు తనకు తానుగా బెయిల్ రద్దు చేయొచ్చు లేదా దర్యాప్తు సంస్థ/ఫిర్యాది బెయిల్ రద్దు పిటీషన్ వేయొచ్చు. అలాగే బెయిల్ పొందిన వ్యక్తి వల్ల ఇబ్బంది పడిన వ్యక్తి కూడా బెయిల్ రద్దు పిటీషన్ వేయొచ్చు. అయితే ఆర్ రత్నం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులో బెయిల్ రద్దు కోరుతూ మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) వేసిన పిటీషన్‌ను తిరస్కరించాలని లేదని పేర్కొన్న విషయాన్ని రఘు రామకృష్ణ రాజు ప్రస్తావించారు. అంతకుముందు పలు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులలో ఉన్న ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ…ఈ పిటీషన్ వేసేందుకు తనకు పూర్తి హక్కు ఉందన్నారు.
వైఎస్ జగన్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజు పేర్కొన్నారు. అలాగే కోర్టులను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలను అరెస్ట్ చేసిన వైనాన్ని ఆయన పిటీషన్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందంటూ ఎన్నడూ లేనివిధంగా జనంపై కేసులు మోపుతున్నారని, జనం గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. తప్పడు కేసులతో జనాన్ని భయభ్రాంతులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక న్యాయవ్యవస్థపై జరిగిన దాడి గురించి కూడా రాజు తన పిటీషన్‌లో ప్రస్తావించారు. జగన్మోహన్‌రెడ్డి మాత్రమేగాకుండా… ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ స్పీకర్‌లు కూడా న్యాయవ్యవస్థ కామెంట్లు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలతో సుప్రీంకోర్టు జడ్జీలను కూడా బెదింరిచే ప్రయత్నం చేశారని, వాటిని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన తన పిటీషన్‌లో ప్రస్తావించారు.
జగన్‌కు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నారని… ఇలంటి సమయంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని కాబట్టి జగన్ బెయిలును రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నవారు సాక్ష్యాలుగా మారకుండా వారికి రాజకీయ, అధికారిక పదవులను జగన్ ఇచ్చారని పేర్కొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న ఏ2 విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటు ఇవ్వడమేగాక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారన్నారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఇపుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని అన్నారు. అతనికన్నా మరో ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్నా… ఆదిత్యనాథ్‌కు సీఎస్ పదవి ఇచ్చారన్నారు. సహ నిందితునిగా ఉన్న అయోధ్యరామిరెడ్డిని రాజ్యసభ సభ్యునిగా జగన్ చేశారు.
ఎమ్మార్ కేసులో ముద్దాయి అయిన కోనేరు ప్రసాద్‌కు విజయవాడ లోక్‌సభ ఎంపీ టికెట్ ఇచ్చారు.అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న ధర్మాన ప్రసాద రావుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఆయన సోదరునికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. జగన్‌తో పాటు జైలుకు వెళ్ళిన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ నుంచి తీసుకుని తన ప్రభుత్వంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా నియమించారన్నారు. తన కేసులో నిందితునిగా ఉన్న శామ్యూల్‌ను కేబినెట్ ర్యాంక్‌తో తన ప్రభుత్వంలో సలహాదారుగా ఉంచుకున్నారని రాజు తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్, అమరామణి త్రిపాఠి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న కొన్ని కీలక అంశాలను కూడా తన పిటీషన్‌లో రఘు రామకృష్ణ రాజు ప్రస్తావించారు. వాటిలోఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్నవారు ప్రభుత్వ పదవుల్లో ఉండేందుకు అనుమతించరాదని సుప్రీం అన్న అంశాలను పిటీషన్‌లో పేర్కొన్నారు.
ఇలా ఈ గ్యాంగ్ మొత్తం సాక్ష్యాలను తారుమారు చేసి, కేసులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రఘు రామకృష్ణరాజు తన పిటీషన్‌లో పేర్కొన్నారు.