MLA Vasupalli Ganesh: టిడిపి నుంచి వైసీపీకి ఫిరాయించిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఝలక్ తగిలింది. ఆయనకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అనూహ్యంగా ఎన్నికలవేళ ఈ పరిణామంతో వాసుపల్లి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దక్షిణ నియోజకవర్గ వైసిపి టికెట్ కోసం వాసుపల్లి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కోర్టు తీర్పు ఆయనకు షాక్ ఇచ్చింది.
ఓ వ్యక్తిపై దాడి కేసులో ఎ2 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారించిన విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. వాసుపల్లి కి ఆరు నెలల సాధారణ జైలుతో పాటు 5000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఎన్నికల ముంగిట ఈ కేసులో తీర్పు రావడం, జైలు శిక్ష ఖరారు కావడంతో ఆయన అనుచరులు కలవరపడుతున్నారు. ఈ కేసులో ఆపిల్ కి వెళ్ళనున్నట్లు వాసుపల్లి ప్రకటించారు. కానీ లోలోపల మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.
వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014,2019 ఎన్నికల్లో మాత్రం గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచాక టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో జైలు శిక్ష ఖరారు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేసు చిన్నదే అయినా.. రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుందని అనుచరులు భావిస్తున్నారు. మొత్తానికి వాసుపల్లి కి గట్టి ఝలక్ తగిలింది.