గత సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షించింది. కారణం అక్కడి రైతులందరు కవితకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి ఆమె ఓటమికి బాధ్యులయ్యారు. ఇదే ప్రణాళికలను ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసేందుకు క్షేత్ర సహాయకులు సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారంతా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలను గ్రామపంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. 7500 ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో వేలాది మంది క్షేత్ర సహాయకులకు నెలల తరబడి నిరసనోద్యమాలు సాగిస్తున్నారు. అరకొర జీతాలతో 14 ఏళ్లుగా నెట్టుకొస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు 4779 సర్క్యులర్ శాపంగా మారింది. గ్రామాల్లో కల్పించిన పని దినాలను బట్టి ఎఫ్ఏల పనితీరును మూడు కేటగిరీలుగా గ్రామీణాభివృద్ధి శాఖ విభజించింది.
తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా పరిణమించిన 4779 సర్క్యులర్ రద్దు చేయాలని, వేతనాలుపెంచాలనే డిమాండ్ తో ఫీల్డ్ అసిస్టెంట్లుప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. మార్చి 12న సమ్మెకు దిగారు. రాష్ర్టంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అదే నెల 20న ఆందోళన విరమించారు. అయితే అప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు వారిని విధుల్లో చేర్చుకోలేదు.
తమను విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వ పెద్దలను కలిసినా సానుకూల స్పందన రాలేదు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా మసలిన ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో ఆగ్రహించిన సీఎం కేసీఆర్ తొలగించిన ఎఫ్ఏల విధులను పంచాయతీ కార్యదర్శులకు కట్టబెట్టారు. ఐదు నెలలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికి ప్రభుత్వం ఎంతకు పట్టించుకోకపోవడంతో నెలలుగా ఉద్యమిస్తున్న ఎఫ్ఏలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగం ద్వారా టీఆర్ఎష్, సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెబుతామని అంటున్నారు. తొలగింపునకు గురైన మొత్తం 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే రాబోయే ఎన్నికలో వెయ్యి మంది పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారికి మద్దతుగా బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య బుదవారం హైదరాబాద్ లో దీక్షకు దిగారు. తమను విధుల్లోకి తీసుకోకుంటే హుజురాబాద్ లో పోటీ చేయాలని భావిస్తున్నామని షరతు విధించారు. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే కేసీఆర్ కూతురు కవితకు ఎదురైన అనుభవమే టీఆర్ఎస్ అభ్యర్థికి ఎదురవుతుందని హెచ్చరించారు.