YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలో భారీ కాన్వాయ్ తో షర్మిల ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. ఆమె వెంట కేవిపి రామచందర్రావు, రఘువీరారెడ్డి తదితర సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న షర్మిల జగన్ సర్కార్ తో తాడోపేడో అన్న రీతిలో ఉంటానని సంకేతాలు ఇచ్చారు. భారీ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకునే క్రమంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ సర్కార్ కు ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్రనాయకత్వం షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ముందుగా కడప జిల్లా ఇడుపలపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే రాజశేఖర్ రెడ్డి లక్ష్యమని.. ఆ ఆశయాన్ని నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న ఆమె.. ఏఐసీసీ నాయకులు,రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమక్షంలో పిసిసి పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీతో పాటు వైయస్సార్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే ముందు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు.విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి కార్యకర్తలు, అభిమానులు ఆమెను ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా షర్మిల వైసీపీ సర్కార్ పై కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ను చూసి ఈ ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. తమ కాన్వాయ్ కు అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. అనవసరంగా ఎందుకు కాన్వాయ్ ను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్ అంటూ పోలీస్ అధికారులను ప్రశ్నించడం వైరల్ గా మారింది. ఇది పోలీసు అధికారులను ఉద్దేశించి కాదని.. నేరుగా సీఎం జగన్ ను ప్రశ్నించినట్టు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.కాంగ్రెస్ కార్యకర్తలను ఏమన్నా ఊరుకునేది లేదని.. కార్యకర్తల కోసం అవసరమైతే జైలుకు వెళ్తామని షర్మిల స్పష్టం చేశారు. మొత్తానికైతే జగన్ సర్కార్ కు ఆదిలోనే షర్మిల గట్టి హెచ్చరికలు పంపారు.