
Y. S. Sharmila: ‘నేను రాజశేఖరరెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. పిల్లి కాదు.. మాది పాదయాత్రల కుటుంబం.. యాత్ర చేసే పేటంట్ తమకే ఉంది’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల. తెలంగాణలో చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చేయాలని లక్ష్యంగా పేట్టుకున్నారు. దీనిని ఎవరూ కాదనరు. ఎందుకంటే.. ఎవరి వ్యూహమైనా.. ఉద్దేశమైనా ఇదే. అయితే.. పాదయాత్ర చేసే సమయంలో వైఎస్సార్‌కు ఉన్న ఓపిక.. షర్మిల ప్రదర్శిస్తున్న ఆవేశం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తన తండ్రి, దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారని.. ఆయన బాటలోనే తాను నడుస్తున్నానని షర్మిల పదేపదే చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే తెలంగాణలో రాజన్న పాలన తెస్తానని హామీ ఇస్తున్నారు. అయితే.. వైఎస్సార్ ఇలా పాదయాత్ర చేయ లేదని అంటున్నారు పరిశీలకులు. 2003లో ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేసిన వైఎస్.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని దించేసి.. ఓటమి అలుపులో స్పృహ లేకుండా పడిఉన్న కాంగ్రెస్‌కు జవసత్వాలు ఇవ్వాలనే నిర్ణయంతో పాదయాత్ర చేశారు.
ఆయన ఓపికే వేరు..
నిజానికి.. వైఎస్ పాదయాత్రను నాడు సొంత పార్టీ నాయకులే అడ్డుకేనే ప్రయత్నం చేశారు. అధికార టీడీపీ ఎన్నడూ వైఎస్సార్ యాత్రను అడ్డుకునేందుకు యత్నించలేదు. రాజశేఖరరెడ్డి యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్‌లోని కొంతమంది వైఎస్సార్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. అయినా రాజశేఖరరెడ్డి ఎక్కడా అసహనానికి గురికాలేదు. అసహనం ప్రదర్శించలేదు. దుర్భాషలాడలేదు. ఎవరినీ పరుశ పదజాలం వాడలేదు. అధికార పార్టీ టీడీపీపైనా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా.. ప్రజలకు చేరువయ్యారు. నేనున్నానంటూ.. వారిలో భరోసా కల్పించారు. అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా పేదల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ప్రజలకే చేరువ కావాలనుకున్నారు..
నాడు మీడియా అధికార పార్టీకే కొమ్ముకాసింది. అయినా తాను మీడియా దృష్టిలో పడడం కన్నా.. ప్రజలకు చేరువ కావడమే ముఖ్యమని వైఎస్సార్ భావించారు. విపరీత వ్యాఖ్యల ద్వారా.. వివాదాస్పద కామెంట్ల ద్వారా.. బూతుల ద్వారా.. సంచలనం కావాలని, మీడియాలో నిలవాలని ఆయన ఎప్పుడూ భావించలేదు. ఓపిక, సహనం కూడగట్టుకుంటూ ముందుకు సాగారు.

షర్మిలకేది ఆ ఓపిక..
తన తండ్రి, దివంగల ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని పాదయాత్ర చేస్తున్నానని చెబుతున్న షర్మిల.. తండ్రి వైఎస్సార్ పాటించిన ఒక్క నియమాని కూడా పాటించినట్లు కనిపించడం లేదు. హావభావాలు, ముఖ కవళికలు రాజశేఖరరెడ్డిని పోలి ఉన్నాయి తప్ప.. ఆయనలోని ఓపిక, సహనం కాస్త కూడా షర్మిలకు లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షర్మిల కేవలం మీడియాలో హైలెట్ కావడం కోసమే సంచలనాల కోసమే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్న షర్మిల, తనపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించలేకపోతోంది. సహనం కోల్పోయి పరుశ పదజాలం వాడుతోంది. దుర్భాషలాడుతోంది. వారి కుటుంబ సభ్యులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ఇది మంచి పరిణామం కాదని, రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతరులు చేసే వ్యాఖ్యలను చేసిన వారి విజ్ఞతకు వదిలేసి, ప్రజలు ఆలోచించాలని చెబుతూ ఓపికగా ముందుకు సాగితే బాగుంటుందని సూచిస్తున్నారు. తాను చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు, వాడుతున్న భాషపై షర్మిల ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిస్తున్నారు. వైఎస్సార్.. వారసురాలిగా తండ్రిని అనుసరిస్తే చాలు అని పేర్కొంటున్నారు.
