CM Jagan- Minister Vishwaroop: సీఎం జగన్ తో కూర్చోవాలంటే ఆషామాషి కాదు

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ సొమ్ము ఖాతాల్లోకి జమ చేయడానికి గాను సీఎం జగన్ అమలాపురం వచ్చారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో ఫోటో సెషన్ కి దిగారు.

Written By: Dharma, Updated On : August 12, 2023 5:10 pm

CM Jagan- Minister Vishwaroop

Follow us on

CM Jagan- Minister Vishwaroop: సీఎం జగన్ వ్యవహార శైలి పై ఎన్నెన్నో కామెంట్స్ వినిపిస్తుంటాయి. పెద్దలకు గౌరవం ఇవ్వరని.. పార్టీలో ఎంతటి కాకలు తీరిన నాయకులైనా.. ఆయన ముందు నిలబడాల్సిందేనని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇది నిజమే నన్నట్లు చాలా సందర్భాల్లో ఇటువంటి దృశ్యాలు వెలుగు చూశాయి. వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినప్పుడు.. పక్కన ఉండే సీనియర్ మంత్రులు సైతం నిలబడుతూ కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు అమలాపురం లో ఇటువంటి దృశ్యం ఒకటి వెలుగు చూసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ సొమ్ము ఖాతాల్లోకి జమ చేయడానికి గాను సీఎం జగన్ అమలాపురం వచ్చారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో ఫోటో సెషన్ కి దిగారు. కానీ ఆ ఫొటోలలో మంత్రి విశ్వరూప్ వంగుతూ కూర్చోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎంతో పాటు డ్వాక్రా మహిళలందరికీ కుర్చీలు వేశారు. కానీ మంత్రి విశ్వరూప్కు మాత్రం వేయలేదు. దీంతో మంత్రి ఒకవైపు ఒదుగుతూ మహిళలకు వేసిన కుర్చీలో సర్దుబాటు చేసుకోవడం ఫోటోలో కనిపిస్తోంది. పక్కన సీఎం జగన్ దర్జాగా ప్రత్యేక సీట్లో కూర్చున్నారు. మంత్రివర్గ సహచరులకు మాత్రం కనీస గౌరవం దక్కకపోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దళిత మంత్రికి అవమానం జరిగిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అసలే ఇది ఎన్నికల సీజన్. ఈ సమయంలో నాయకులు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే రాజకీయ ప్రత్యర్థులకు చిక్కుతారు. ఇప్పుడు జగన్ విషయంలో జరుగుతుంది అదే . చిన్న అంశాన్ని భూతద్దంలో వేసి చూపే ప్రత్యర్ధులు చుట్టూ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఇటువంటి ప్రచారంలో వైసీపీ శ్రేణులే ముందుంటాయి. ఇప్పుడు వారు నేర్పిన విద్యే అన్నట్టు ఏ చిన్న అంశం దొరికినా అధికార పార్టీకి వ్యతిరేకంగా.. సోషల్ మీడియా లో ఇట్టే ట్రోల్ అవుతోంది.రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలకు మించి.. సోషల్ మీడియాలో ప్రభుత్వం పై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం తప్పదు. అయితే ఇటువంటి ప్రచారానికి అలవాటు పడిపోయిన అధికార పార్టీకి ఇది తెలియంది కాదు.