Homeజాతీయ వార్తలుRevanth Reddy : తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి సంచలన లేఖ..

Revanth Reddy : తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి సంచలన లేఖ..

Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి రాసిన లేఖ వైరల్ అవుతోంది. తెలంగాణ రాజకీయాలు, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆడుతున్న ఆటలను ఆయన ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రస్తావించి ఈ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

‘‘ఎనిమిదేళ్లుగా భారతదేశం నిర్భందంలో ఉంది. భావస్వేచ్ఛే కాదు బతుకు స్వేచ్ఛ కూడా కరువైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటున్నారు. తప్పును ఎత్తి చూపడాన్ని నేరం అంటున్నారు. బ్రిటీష్ వాడు విభిజించి పాలించిన సిద్ధాంతం బీజేపీ పాలనలో మళ్లీ పురుడు పోసుకుంది. ప్రజల వేషభాషలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు లోబడాల్సిన దుస్థితి. ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనమైంది. ఉపాధి, ఉద్యోగం లేక 22 కోట్ల మంది యువశక్తి నిర్వీర్యమైపోతోంది. చమురు ధరలు చుక్కలనంటాయి. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆకలి సూచిలో 107వ స్థానానికి మన దేశం ఎగబాకింది’’ అంటూ రేవంత్ తన లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఫాంహౌస్ కే పరిమితమైందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘ఎనిమిదేళ్లు బీజేపీ అరాచకాలకు టీఆర్ఎస్ వంతపాడింది. నల్ల చట్టాలకు మద్ధతిచ్చింది. వ్యవస్థల విధ్వంసానికి అంతే లేదు. పథకాల మాటున అడ్డుఅదుపు లేని దోపిడీ జరుగుతోంది. రైతు రుణమాఫీ హామీ అమలు లేదు. అన్నదాతల ఆత్మహత్యల పరంపర ఆగడం లేదు. ఉచిత ఎరువుల హామీ కాకెత్తుకెళ్లింది. నిరుద్యోగులకు భృతి ఓ భ్రమగా మిగిలింది. ఖాళీల భర్తీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. పోడు భూములకు పట్టాలు ఒక బోగస్ మాట. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతోంది. భూ కుంభకోణాలకు అంతే లేదు. డబుల్ బెడ్ రూం హామీ అతీగతీ లేదు. విద్యా వ్యవస్థ విధ్వంసమైంది. ఉచిత వైద్యం ఎండమావిగా మిగిలింది.’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.

ఈ పరిస్థితుల్లో ఒక్కడు దేశం కోసం అడుగు ముందుకు వేశాడు. ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ… బానిస సంకెళ్లను తెంచేస్తూ… ఆసేతు హిమాచలాన్ని ఏకం చేస్తూ శ్రీ రాహుల్ గాంధీ గారు “భారత్ జోడో” పాదయాత్రగా బయలుదేరారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో వేసిన తొలి అడుగు రాష్ట్రాలు దాటుతూ అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించింది. ఆ మానవీయ నేతకు మన సమాజం అడుగడుగునా ఘనస్వాగతాలు పలుకుతోంది. అప్రతిహతంగా సాగిపోతోన్న “భారత్ జోడో యాత్ర” నవంబర్ 1న చారిత్రక మహా నగరమైన హైదరాబాద్ లోకి ప్రవేశిస్తోంది. ఛార్మినార్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై… సాయంత్రం ఐదు గంటలకు నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో చరిత్రను ఒక్క సారి గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిన జ్ఞాపకాలు మన కళ్ల ముందున్నాయి. నగర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ… అభివృద్ధికి కొత్త బాటలు వేసింది కాంగ్రెస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి బయో టెక్నాలజీ వరకు ఆకాశమే హద్దుగా సాగిన హైదరాబాద్ ప్రస్థానంలో అడుగడుగునా కాంగ్రెస్ ‘హస్తం’ ఉంది. ఈ దేశాన్నే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలోకి నడిపించిన నాయకుడు మన ప్రియతమ నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో నగరాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లిన చరిత్ర ఒకరు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు.

స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన అస్థిత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి కారణం హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ ను మనకు వరంగా ఇచ్చింది కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్నే కాదు… ఇంతటి ఆర్థిక పరిపుష్ఠి నగరాన్ని మనకందించిన కాంగ్రెస్ నవ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా గత జ్ఞాపకాలను స్మరిస్తూ… రేపటి భవిష్యత్ కోసం ఆయనకు మద్ధతుగా నిలుద్దాం. శ్రీ రాహుల్ గాంధీ అడుగుతో అడుగు కలుపుదాం. రాజకీయాలకు అతీతంగా ఆయనతో జత కడదాం. కనీసం ఒక్క కిలోమీటరైనా కలిసి నడుద్దాం. దేశ ఐక్యత మా ప్రాధాన్యత అని చాటుదాం. దేశం కోసం ఒక్క రోజు… ఒక్క గంట గడప దాటి రండి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వస్తారని ఆశిస్తూ… ఈ దేశం కోసం రాహుల్ తో కలిసి కదం తొక్కుతారని విశ్వసిస్తూ…. నవంబర్ ఒకటి, మధ్యాహ్నం మూడు గంటలకు ఛార్మినార్ వద్ద కలుసు కుందాం అంటూ పిలుపునిచ్చాడు.

– తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలు
• ఎనిమిదేళ్లుగా భారతదేశం బందీగా ఉంది – రేవంత్
• భావస్వేచ్చే కాదు… బతికే స్వేచ్ఛ కూడా లేదు – రేవంత్
• 22 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు – రేవంత్
• నిత్యావసరాలు, చమురు ధరలు భగ్గుమంటున్నాయి – రేవంత్
• ప్రశ్నిస్తే దేశద్రోహం అని బీజేపీ అంటోంది – రేవంత్
• తెలంగాణలో కేసీఆర్ పాలన దేశంలో మోడీ పాలనకు తేడా లేదు – రేవంత్
• రైతులు, యువతకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారు – రేవంత్
• హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనత – రేవంత్
• ఐటీ నుండి బయో టెక్నాలజీ వరకు … ఔటర్ నుండి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి – రేవంత్
• స్వరాష్ట్రమే కాదు… ఆర్థిక పరిపుష్ఠి కలిగిన హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చింది కాంగ్రెసే – రేవంత్
• రాజకీయాలకు అతీతంగా భారతో జోడోకు ప్రతి ఒక్కరు మద్ధతివ్వాలి – రేవంత్
• రాహుల్ తో కలిసి కనీసం ఒక్క కిలోమీటరైనా నడవాలి – రేవంత్
• రేపు ఛార్మినార్ దగ్గర యాత్రలో పాల్గొనాలి – రేవంత్
• రేపు సాయంత్రం 5 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద సభకు ప్రతి ఒక్కరు కదిలి రావాలి – రేవంత్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version