Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. గురువారం వారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీకి సీనియర్లు ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించారు. సీనియర్ల ప్రకటన ఇప్పుడు గుజరాత్‌లో చర్చనీయాంశమైంది.

దేశవ్యాప్తంగా ఆసక్తి..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం కావడమే ఇందకు కారణం. ఈసారి ఎవరు గెలుస్తారని దేశం మొత్తం నిషితంగా గుజరాత్ రాజకీయాలను గమనిస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. పంజాబ్ మాదిరే గుజరాత్‌లో కూడా సంచలన సృష్టిస్తామని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ధీమాగా ఉంది. డబుల్ హ్యాట్రిక్ కొడతామని బీజేపీ పేర్కొంటోంది. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో.. గుజరాత్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటచేసుకుంది. ఎన్నికల్లో పోటీచేయబోమని.. బీజేపీ సీనియర్ నేతలు సంచలన ప్రకటన చేస్తున్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌పటేల్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా.. ఇదే బాటలో ఉండాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది.
కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని..
సీనియర్లు పోటీకి దూకంగా ఉండడంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గాంధీనగర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఐదేళ్లు సీఎంగా పనిచేశా. ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యక్తులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలి. నేను ఎన్నికల్లో పోటీ చేయబోను. దీనిపై ఇప్పటికే హైకమాండ్‌కు లేఖ రాశాను. ఏ అభ్యర్థులను ఎంపిక చేసినా వారిని గెలిపించేందుకు ప్రయత్నిస్తా’ అని పేర్కొన్నారు.
– సీనియర్ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ చూడాసమా కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని పార్టీ సీనియర్ నేతలకు చెప్పాను. ఇతర కార్యకర్తలకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు 9 సార్లు పోటీ చేశాను. ఇన్నాళ్లు నాపై నమ్మకం వచ్చిన పార్టీకి కృతజ్ఞతలు’ అని భూపేంద్రసింగ్ తెలిపారు.

– మరో ఎమ్మెల్యే ప్రదీప్‌సింగ్ జడేజా కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. ‘నేను వత్వా అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసే గొప్ప అవకాశాన్ని పార్టీ నాకు కల్పించింది. 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం నాకు ఇష్టం లేదు. రానున్న రోజుల్లో పార్టీ అప్పగించిన బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తా. ’ అని ప్రకటించారు.
సీనియర్ల ఆకస్మిక నిర్ణయంలో ఆంతర్యం ఏమిటి?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయిన విషయం తెలిసిందే. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఒక్క రోజు ముందు బీజేపీ సీనియర్ నేతలు పోటీకి దూకంగా ఉంటామని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. స్వయంగా తప్పుకుంటున్నారా లేక అధిష్టానం ఒత్తిడి చేస్తుందా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ ప్రధాన మోదీ సొంత రాష్ట్రం కావడంతో అక్కడ ఆయన ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక, తప్పించడం కూడా ఆయన సూచన మేరకే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ప్రధాని సూచనతోనే సీనియర్లు తప్పుకుంటున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక గుజరాత్‌లో పాగా వేయాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ సీనియర్ల నిర్ణయాన్ని తమ ప్రచారాస్త్రంగా మార్చుకుంటోంది. తమ చేతిలో ఓటమి తప్పదనే సీనియర్లు పోటీకి భయపడుతున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో గుజరాత్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.