YCP Rajya Sabha: వైసిపిలో రాజ్యసభ సభ్యుల ఎంపిక కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో వైసీపీకి 9 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ లో భర్తీ కానున్న మూడు స్థానాలతో ఆ సంఖ్య 12 కు చేరనుంది. అయితే అప్పటికి ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో వ్యూహమే ధ్యేయంగా రాజ్యసభ స్థానాల ఎంపిక జరగనుంది. ఈ మేరకు సీఎం జగన్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సామాజిక సమీకరణల ఆధారంగా రాజ్యసభ స్థానాల ఎంపిక జరిగినా.. ఈ మూడు స్థానాలు విషయంలో మాత్రం జగన్ విభిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనక మేడల రవీంద్ర కుమార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న బలాబలాలను బట్టి ఆ మూడు స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. అయితే రాజ్యసభ ఆశావహుల విషయంలో సరికొత్త ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో కొత్తగా ఎవరికి ఛాన్స్ ఇస్తారన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.
వైసీపీ నుంచి రిటైర్ అయిన సభ్యుడు వేం రెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ తరుణంలో వైసిపి కొత్తగా ముగ్గురు సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉంది. టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి రాజ్యసభ పదవి కట్ట పెడతారని ప్రచారం జరుగుతోంది. రెండో రాజ్యసభ పదవికి పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేరు వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పోటీ చేయలేదు. ఎన్నికల్లో ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ పదవీ కట్టబెట్టే అవకాశం ఉంది. అటు రఘువీరారెడ్డి సైతం వైసీపీలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఇద్దరికే రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు. మూడో స్థానాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కు కేటాయిస్తారని సమాచారం.
సీఎం జగన్ తో పాటు వైసిపి నాయకులు పై కేసులు నడుస్తున్నాయి. సిబిఐ తో పాటు సుప్రీంకోర్టులో వాటిపై విచారణ కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో మాజీ న్యాయమూర్తి సలహాలు అవసరమని జగన్ భావిస్తున్నారు. అందుకే జాస్తి చలమేశ్వర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆయనతో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తారని సమాచారం. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో చూడాలి మరి.