
గతేడాది లాక్‌డౌన్‌తో ఆయా రంగాలతోపాటు.. ప్రైవేటు విద్యారంగం కూడా పూర్తిగా కుదేలైంది. పెద్ద పెద్ద సంస్థలు మాత్రం తట్టుకొని నిలబడినా.. చిన్నపాటి సంస్థలైతే చాలావరకూ మూతపడ్డాయి. దీంతో చాలా మంది ప్రైవేటు టీచర్లు చాలారకాల ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్ బోధన వారికి పెద్దగా గిట్టుబాటు కాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పలేదు. కొందరైతే అప్పులపాలైనా అదే వ్యవస్థలో ఉండాలనుకున్న వారు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త ముందుగా మొదలు పెట్టగా, తెలంగాణ సర్కారు మాత్రం చాలా ఆలస్యంగా స్టార్ట్ చేసింది. ప్రైమరీ సెక్షన్ ఇంకా మొదలు పెట్టనేలేదు. ఈ క్రమంలోనే కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో తెలంగాణలో సర్కారు కాస్త ముందుగా స్పందించింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసేసింది. అయితే.. స్కూళ్లు మూసేసినా సినిమా థియేటర్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు తీసే ఉంచడం విమర్శలకు తావిస్తోంది. స్కూళ్లతో వచ్చే కరోనా థియేటర్లు, బార్లు.. బార్లా తెరిస్తే రాదా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
ఇదెక్కడి న్యాయం అంటూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఆమరణ దీక్షకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. స్కూల్స్ మూసేస్తే మూసేశారు కనీసం మాకు బార్లు తెరుచుకునే లైసెన్స్ లు అయినా ఇప్పించండి, జీవనోపాధి చూపించండి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి ప్రైవేటు విద్యాసంస్థలు. ఓవైపు లాక్‌డౌన్ లేదని చెబుతున్న సీఎం కేసీఆర్, స్కూల్స్ ఎందుకు మూసేశారని ప్రశ్నిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు.
ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇలా స్కూల్స్ పై పిడుగు వేయడం సరికాదని అంటున్నారు. పొరుగున ఉన్న ఏపీలో స్కూల్స్ క్లోజ్ చేయలేదని ఉదాహరణగా చూపెడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే స్కూల్స్ మూసివేసినట్టుగా చెబుతున్నారు కేసీఆర్. ప్రైవేటు యాజమాన్యాల గొడవ తర్వాత అధికారులు చెబుతున్న మాట కూడా అదే. పేరెంట్స్ వద్దంటే స్కూల్స్ ఎలా పెడతారని అంటున్నారు. కరోనా భయం తగ్గేవరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. కానీ.. ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ మాత్రం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేలా లేవు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకే వాడు సిద్ధపడినట్లుగా అర్థమవుతోంది.