
Saidabad Rapist Raju : సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు కథ ముగిసింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యచేసినట్టుగా అనుమానిస్తున్న నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. చిన్నారిపై దారుణ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత రాజు శవమై తేలాడు. దీంతో.. సింగరేణి కాలనీవాసులు సంబరాలు చేసుకున్నారు. రాజకీయసినీ ప్రముఖులతోపాటు సామాన్యులు సైతం తగినశాస్తి జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు.. చిన్నారిపై దారుణం జరిగిన రోజు నుంచి నిందితుడు రాజు చనిపోయే వరకు ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయన్నది ఇప్పుడు చూద్దాం.
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే 30 సంవత్సరాల రాజు ఆటో డ్రైవర్ గా పనిచేశాడు. అయితే.. తాగుడుకు బానిసైన రాజు.. జులాయిగా తిరుగుతాడని పేరుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో నిత్యం గొడవ పడడంతో.. ఆమె వదిలేసి వెళ్లిపోయింది. దీంతో.. ఒంటరిగా ఉంటూ ఏదో ఒక పనిచేసుకుంటూ.. వచ్చిన డబ్బులతో తాగుతూ జీవనం సాగించేవాడు రాజు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 9వ తేదీన మాదన్నపేటలో భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. పొద్దున 9 గంటలకు వెళ్లిన రాజు.. సాయంత్రం 4 గంటలకు తన రూమ్ కు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే.. సాయంత్రం వేళ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి తన గదిలోకి తీసుకెళ్లాడని, అనంతరం అత్యాచారం చేసి, ఏడుస్తుండడంతో చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ దారుణం చేసిన తర్వాత తన గదికి తాళం వేసి బయటకు వచ్చి, కొద్దిసేపు సమీప ప్రాంతాల్లో తిరిగాడట. సాయంత్రం 7 గంటల సమయంలో అక్కడే ఉన్న పానీపూరి బండి వద్ద పానీపూరి తిన్నాడు. అప్పటికే.. పాప కనిపించట్లేదని కుటుంబ సభ్యులు, తెలిసినవాల్లు వెతుకుతున్నారు. ఈ క్రమంలో.. రాత్రి తొమ్మిది గంటల సమయంలో చిన్నారి నానమ్మ ఎదురు పడగా.. పాప కనిపించిందా? అని అడిగాడు. తాగిన మత్తులో ఉన్న రాజు.. ఒక విధంగా ప్రశించే సరికి ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే వెళ్లి ఇంట్లోని వారికి చెప్పింది.
అప్పటికే రాజు ప్రవర్తన ఎలాంటిదో తెలిసిన వారంతా.. పాప చెవులకున్న బంగారు దుద్దుల కోసం ఎత్తుకెళ్లి ఉండొచ్చని అనుమానించారు. ఈ విషయం ఆనోటా ఈనోటా రాజు చెవికి చేరడంతో.. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత విషయం పోలీసుల వద్దకు వెళ్లింది. కుటుంబ సభ్యులు రాత్రి పది గంటల సమయంలో రాజు ఇంటి తలుపులు పగలగొట్టాలని చూశారు. అయితే.. కాస్త వేచి చూద్దామని పోలీసులు తెలిపారు. రాత్రి 12 గంటల వరకు చిన్నారి కోసం వెతికారు. కానీ.. కనిపించలేదు. దీంతో.. రాజు గది వద్దకు వచ్చి తలుపులు పగలగొట్టారు. అక్కడ.. చిట్టితల్లి మృతదేహం కనిపించే సరికి గుండెలవిసేలా తల్లిదండ్రులు, బంధువులు రోదించారు.
అప్పటి నుంచి నిందితుడు రాజుకోసం పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. రోజుల తరబడి వెతుకుతున్నా ఆచూకీ తెలియకపోవడంతో.. సెప్టెంబర్ 15వ తేదీన రాజు ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. అదేవిధంగా.. నిందితుడిని పట్టుకునేందుకు ఏకంగా 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. నగరంతోపాటు రాష్ట్రం మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు.
సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం 8.44 నిమిషాల సమయంలో స్టేషన్ ఘన్ పూర్ దగ్గర్లోని నష్కల్ రైల్వే ట్రాక్ మీద రాజు మృతదేహం గుర్తించారు. మృతదేహం చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు ఆధారంగా రాజుదేనని తేల్చారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో.. అతను రైలు కిందపడి చనిపోవడం గమనార్హం.